Year in Search 2022: బాలీవుడ్ లవబుల్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం ” బ్రహ్మస్త్ర “. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. విజువల్ వండర్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ టాక్ సొంతం చేసుకుని పలు రికార్డులను తిరగ రాసింది. కాగా ఇటీవల కాలంలో బాలీవుడ్ లో సినిమాలన్నీ ఫ్లాప్ బాట పడుతున్న నేపధ్యంలో ఈ సినిమా హిట్ సాధించి హిందీ చిత్ర పరిశ్రమకు కొంత ఊరటని ఇచ్చిందనే చెప్పాలి.
అయితే ఇప్పుడు తాజాగా ఈ మూవీ మరో ఘనత సాధించింది. ఈ ఏడాదికి గాను అత్యధికంగా గూగుల్‌లో వెతికిన చిత్రంగా బ్రహ్మస్త్ర టాప్ లో నిలిచింది. కాగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ని తాజాగా ఆవిష్కరించింది. ఈ ఏడాది 11 నెలల్లో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్ సినిమాలు ఉన్నాయి.
మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. గత కొంతకాలంగా ఫిల్మ్ ఇండస్ట్రిలో దక్షిణాది సినిమాల హవా కొనసాగుతున్న తరుణంలో ఈ మూవీ వాటిని వెనక్కినెట్టి ముందు వరుసలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణాదిలో ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్, కాంతార , కార్తికేయ 2 వంటి చిత్రాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి.