Brahmastra: రణ్‌బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం రణ్‌బీర్ కపూర్, నాగార్జున, దర్శకుడు రాజమౌళి చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ఈ మీడియా సమావేశంలో దర్శకుడిగా కాకుండా, ఒక సినీ ప్రేక్షకుడుగా మాత్రమే హాజరయ్యనని చెప్పారు. బ్రహ్మాస్త్ర సినిమా ఈ ఏడాది ఇండియన్ సినీ చరిత్రలో అతి ముఖ్యమైన సినిమాగా ఉంటుందన్నారు. మన పురాణ ఇతిహాసాల నుంచి కల్పిత కథా చిత్రం మొదలు అవుతుందని చెప్పారు. ఈ సినిమా యూనిట్ 8 ఏళ్ల నుంచి పని చేస్తున్నారని పేర్కొన్నారు. అస్త్రాల పూర్తి వివరాలను అందరికి నచ్చే విధంగా రాజమౌళి తన మాటల్లో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తానూ ఒక భాగం కావడం సంతోషంగా ఉందని వెల్లడించారు.
నాగార్జున మాట్లాడుతూ దర్శకుడు అయన్ ముఖర్జీ ఒక కామిక్ అనే పుస్తకంతో తనను కలిశారని తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర నంది అనే అస్త్ర నేపథ్యంగా ఉంటుందన్నారు. తనకు చిన్న తనం నుంచి ఇతిహాసాలంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. ఆ ఇష్టం వల్లే నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. చిత్రంలో విజువల్స్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయని అన్నారు. దర్శకుడు అయన్ ముఖర్జీ 10 ఏళ్ల నుంచి ఈ సినిమా కోసం శ్రమించారు. రణ్‌బీర్ కపూర్, అలియాభట్‌లు చాలా కష్టపడతారని వాళ్ళ ఇద్దరినీ ప్రశంసించారు. నేను నటించిన తొలి 3డీ సినిమా ఇదే అని నాగార్జున తెలిపారు.
నటుడు రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ బ్రహ్మాస్త్ర సినిమాలో నటించడం నాకు చాలా సంతోషంగా ఉందని తన మాటల్లో వ్యక్తం చేసారు. సంస్కృతిని గౌరవించే ఈ సమాజంలో తాను ఈ సినిమాను చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర మూల కథను దర్శకుడు తనకు 10 ఏళ్ల క్రితమే చెప్పారని తెలిపారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి గొప్ప నటులతో కలిసి నటించడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నేను అలియాభట్ కలుసుకున్నామని, ఇప్పుడు మాకు పెళ్లి కూడా జరిగిందని రణ్‌బీర్ కపూర్ తెలిపారు. బ్రహ్మాస్త్ర సినిమా నాకు కొత్త అనుభూతినిచ్చిందని రణ్‌బీర్ కపూర్ తెలిపారు.