Allu Arjun: నాంపల్లి కోర్టుకు హాజరు కానున్న అల్లు అర్జున్‌

  • Written By:
  • Updated On - December 27, 2024 / 11:07 AM IST

Allu Arjun Will Attend Nampally Court: సినీ నటుడు అల్లు అర్జున్‌ మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏ11 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన అరెస్ట్‌ కాగా నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ్‌ జైలుకు తరలించారు. అయితే నేటితో (డిసెంబర్‌ 27) కోర్టు విధించిన రిమాండ్‌ పూర్తి అవుతుంది.

రిమాండ్‌ గడువు పూర్తవ్వడంతో ఆ తర్వాత జరిగే ప్రాసెస్‌లో భాగంగా అల్లు అర్జున్‌ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బన్నీ తన తరపు లాయర్లతో కలిసి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన తరపు లాయర్లు అల్లు అర్జున్‌కి హైకోర్టుకు బెయిల్‌ ముంజూరు చేసినట్లు తెలిపి ఇందుకు సంబంధించి పేపర్స్‌ను కోర్టుకు సమర్పించనున్నారు. కాగా రెగ్యులర్‌ బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని గతంలోనే అల్లు అర్జున్‌ న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. ఈ మేరకు వారు నేడు నాంపల్లి కోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ పటిషన్‌ వేసే అవకాశం ఉంది.

కాగా పుష్ప 2 మూవీ రిలీజ్‌ సందర్భంగా డిసెంబర్‌ 4న బెనిఫిట్‌ షోలు వేసిన సంగతి తెలిసిందే. సినిమా చూసేందుకు బన్నీ తన కుటుంబంతో కలిసి సంధ్య థియేటర్‌కు వెళ్లాడు. అల్లు అర్జున్‌ అక్కడికి రావడంతో ఆయనను చూసేందుకు అభిమాలంత ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకోవడంతో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. ఈ మధ్య కాస్తా కొలుకున్నట్టు వైద్యులు తెలిపారు.