Akkineni Nageswara Rao : తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న లెజెండ్ లలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. సాంఘికం, పౌరణికం, సోషియో ఫాంటసీ, క్లాస్, మాస్.. అన్ని తరహా చిత్రాలలో నటించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుల్లో అక్కినేని క్కూడా ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటికీ తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏఎన్నార్.. రెండు కళ్ల లాంటి వారు అని ఎందరో ప్రముఖులు వెల్లడించారు. కాగా నేడు అక్కినేని నాగేశ్వరరావు.. శత జయంతి వేడుకలను అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవ్వగా.. మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, మంచు విష్ణు, జగపతిబాబు, నాజర్, బ్రహ్మానందం.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఈ మేరకు వెంకయ్య నాయుడు అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
A moment of joy and pride for the fans of #AkkineniNageswaraRao Garu ✨💫
Former Vice President of India Shri. @MVenkaiahNaidu Garu unveils the statue of #ANR garu at @AnnapurnaStdios marking the centenary birthday ❤️
Watch ANR 100 Birthday Celebrations live now!
-… pic.twitter.com/5ajMSNFiM1— Annapurna Studios (@AnnapurnaStdios) September 20, 2023
విగ్రహావిష్కరణ అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులంతా అక్కినేని (Akkineni Nageswara Rao)తో తమకు ఉన్న బంధం గురించి మాట్లాడారు. ఏఎన్నార్ కృష్ణ జిల్లా రామాపురం అనే చిన్న గ్రామంలో జన్మించిన సంగతి తెలిసిందే. 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ అనే దంపతులకు ఏఎన్నార్ జన్మించారు. 2014 జనవరి 22న ఏఎన్నార్ తుదిశ్వాస విడిచారు. 1941లో ధర్మపత్ని అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ చిన్న పాత్ర చేశారు మొదట. అనంతరం 1944లో శ్రీ సీతారామ జననం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
దేవదాస్, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం సినిమాలు ఒక క్లాసిక్ లా నిలిచిపోయాయి. బాటసారి, ఆరాధన, కులగోత్రాలు.. లాంటి ఆర్ట్ ఫిలిమ్స్ తీస్తూనే మరో పక్క మాయాబజార్, భూకైలాస్, శ్రీకృష్ణార్జున యుద్ధం.. లాంటి పలు పౌరాణికాల్లో కూడా చేశారు. మరోవైపు పక్కా కమర్షియల్ సినిమాలు కూడా తీసి ప్రేక్షకులని మెప్పించారు. దాదాపు 250కి పైగా సినిమాలో ఎన్నో రకాల పాత్రలతో మెప్పించారు.
పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్.. మూడు దేశ అత్యున్నత అవార్డులు అందుకున్న ఏకైక తెలుగు నటుడుగా అక్కినేని చరిత్రలో నిలిచిపోతారు. ఆయన చివరి రోజుల్లో కూడా మనం సినిమాలో నటించి సినిమానే ప్రాణమని సినిమాతోనే తన ప్రాణాన్ని వదిలారు. హైదరాబాద్ కి సినీ పరిశ్రమకు తరలించిన వారిలో ముఖ్యులుగా నిలిచి అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించి ఎన్నో సినిమాలకు, ఎంతోమందికి అవకాశాలు కల్పించి తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయారు.