Akkineni Akhil : అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం “ఏజెంట్”. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. అయితే, ఏప్రిల్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’.. ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. మొదటి ఆట నుంచే మూవీ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా తీవ్రంగా నిరాశపరిచింది. సుమారు రూ.80 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.
కానీ ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. తన మేకవర్ కూడా పూర్తిగా మార్చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ గా కనిపించిన అఖిల్.. ఈసినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతోపాటు.. మాస్ లుక్ లో కనిపించారు. ఊహించని రీతిలో సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. కాగా ఈ క్రమంలోనే తాజాగా ఏజెంట్ ఫెయిల్యూర్ పై అఖిల్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ షేర్ చేశారు.
మరింత బలంగా తిరిగి వస్తాను – అఖిల్ (Akkineni Akhil)
ఆ నోట్ లో .. “ఏజెంట్ సినిమా తెరకెక్కించడంలో తమ జీవితాలను అంకితం చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. మేము మంచి సినిమాను అందించేందుకు ఎంతో కష్టపడినప్పటికీ దురదృష్టవశాత్తు మేము అనుకున్నదాన్ని స్క్రీన్‌పైకి తీసుకురాలేకపోయాం. ప్రేక్షకుల అంచనాలను అనుగుణంగా మేము ఈ సినిమాను అందించలేకపోయాం. నాకెంతో అండగా నిలిచిన చిత్ర నిర్మాత అనిల్‌కు కృతజ్ఞతలు. మా చిత్రాన్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమ వల్లే నేను కష్టపడి వర్క్ చేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం మరింత బలంగా మారి తిరిగివస్తాను” అంటూ ఓ స్పెషల్ నోట్ షేర్ చేశారు. ఫెయిల్యూర్ ని నిర్మొహమాటంగా ఒప్పుకొని తలలు సారి చేసుకొని మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తానని అఖిల్ చెప్పడం అభిమనులతో పాటు సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
అంతకు ముందు నిర్మాత అనిల్ సుంకర కూడా ట్విట్టర్ వేదికగా తప్పు తమదేనంటూ.. అభిమానులను క్షమాపణలు కోరారు. ఏజెంట్ చిత్రంపై పడుతున్న నిందలన్నీ మేమే భరించాలి. ఇది చాలా కష్టమైన పని అని తెలిసినప్పటికీ గెలవాలని అనుకున్నాం. కానీ బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్ ప్రారంభించి తప్పు చేయడం, కొవిడ్ సహా అనేక సమస్యలు చుట్టుముట్టడంతో అలా చేయడంలో విఫలమయ్యాం. ఈ విషయంలో ఎలాంటి సాకులు చెప్పకూడదనుకుంటున్నాం. కానీ కాస్ట్‌లీ మిస్టేక్ నుంచి నేర్చుకుని, ఇలాంటివి ఎప్పటికీ రిపీట్ కాకుండా ఎలా తిరిగొస్తామో చూడండి. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు. మా భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో డెడికేటెడ్ ప్లానింగ్‌తో కష్టపడి నష్టాలను భర్తీ చేస్తాము’ అని ట్వీట్ చేశారు నిర్మాత అనిల్.