Postal Department: నిరుద్యోగులకు తపాలా శాఖ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీ తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 12 వేల 828 గ్రామీణ డాక్ సేవక్ (GDS)ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను టెన్త్ లో సాధించిన మార్కులతో మెరిట్ ఆధారంగా చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) పోస్టుల్లో విధులు నిర్వహించాలి. ఆసక్తి గల అభ్యర్థులు మే 22 నుంచి జూన్ 11 లోగా https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ మొత్తం పోస్టులు 12,828 విడుదల అయింది. ఇందులో ఏపీలో 118, తెలంగాణలో 96 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష తప్పనిసరి.
ఏపీ, తెలంగాణకు చెందినవాళ్లు పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ నాలెజ్డ్ తో పాటు సైకిల్ తొక్కటం రావాలి.
11-06-2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠంగా వయసులో సడలింపు ఇచ్చారు.
బీపీఎం పోస్టులకు నెలకు వేతనం రూ. 12,000 నుంచి రూ. 29, 380 లు, ఏబీపీఎం పోస్టులకు రూ. 10,000 నుంచి రూ. 24, 470 చొప్పున జీతాలు చెల్లిస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్‌లకు ఎలాంటి ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి.
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM)పోస్టుకు ఎంపికైన వారు సంబంధిత బ్రాంచ్ కార్యకలాపాలు చూసుకోవాల్సి ఉంటుంది. పోస్టల్ కార్యాకలాపాలతో పాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలు కూడా చూసుకోవాలి.
రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ ట్రాన్పాక్షన్, రోజువారీ కార్యకలాపాలు ఇబ్బందులు లేకుండా సాగేలా, లెటర్స్ పంపిణీ జరిగేలా చూసుకోవాలి.
తపాలాకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలు కూడా చూడాలి. టీమ్ లీడర్ గా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM) ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, లెటర్స్ పంపిణీ జరిగేలా చూసుకోవాలి.
ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు కూడా చేయాలి.
బ్రాంచ్ పోస్టుమాస్టర్ అప్పజెప్పిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.