Site icon Prime9

Venkateswara Swamy Vaibhavotsavalu: శ్రీవారి నేత్ర దర్శనంతో పులకించిన భాగ్యనగరవాసులు

Thousands Have Netra Darshan of Lord Srivaru at Ntr Stadium

Thousands Have Netra Darshan of Lord Srivaru at Ntr Stadium

Hyderabad: ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభోత్సవాల్లో భాగంగా నేడు నేత్ర దర్శనంలో కనువిందుచేసిన శ్రీవారిని వీక్షించిన భాగ్యనగరవాసులు తన్మయత్నంలో మునిగిపోయారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు. అనంతరం ప్రత్యేక సేవగా తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా చేపట్టారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి గురువారం నాడు చేపట్టే సేవల తరహాలోనే నమూనా ఆలయంలో కూడా చేపట్టారు. ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, మొదటి సహస్రనామార్చన, నైవేద్యం తరువాత మూలమూర్తికి అలంకరించిన ఆభరణాలు, నగలను అర్చకులు తొలగిస్తారు. స్వామివారి నొసటి పై పెద్దగా ఉన్న పచ్చ కర్పూరపు నామాన్ని బాగా తగ్గించడంతో శ్రీవారి నేత్రాలు స్పష్టంగా భక్తులకు దర్శనమవుతాయి. అందువల్లే దీనిని నేత్ర దర్శనంగా పేర్కొంటారు.

అనంతరం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి అర్చనానంతరం జరిగే నివేదననే తిరుప్పావడ సేవ అని, అన్నకూటోత్సవమని అంటారు. ఈ ఘట్టాన్ని హైదరాబాద్‌లోని శ్రీవారి నమూనా ఆలయంలో అర్చక స్వాములు భక్తుల ఎదుట ఆవిష్కరించారు.

శ్రీస్వామివారికి ఎదురుగా పెద్దపీఠం పై పులిహోర రాశిని ఏర్పాటుచేశారు. పులిహోరతోపాటు టెంకాయ, ఇతర పూజాసామగ్రితో అలంకరించారు. వీటిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదించారు. ఆ తరువాత భక్తుల చేత సంకల్పం చెప్పించారు. వేదపండితులు వేద పారాయణంతో పాటు శ్రీనివాస గద్యాన్ని పఠించారు.

ఈ మొత్తం కైంకర్యమంతా తెరల వెనకనే చేస్తారు. శ్రీవారు నేత్రాలు తెరిచిన తర్వాత తొలి చూపులు ఎంతో తీవ్రంగా ఉంటాయనేది ప్రతీక. వీటిని చూసిన మానవమాత్రులు ఏమాత్రం తట్టుకోలేరు. ఈ కారణంగానే స్వామివారి తీక్షణమైన చూపులు పులిహోర రాశిపై పడేలా చూస్తారు. దీనివల్ల ఆ ఆహార పదార్థాలు పవిత్రత పొందుతాయనేది ఇతిహాసంతో తెలియవస్తుంది.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ స్టేడియంలో.. శ్రీనివాసునికి శాస్త్రోత్తకంగా సహస్ర కలశాభిషేకం

Exit mobile version