Tirumala: తిరుమల ఘాట్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండ నుంచి తిరుపతికి మొదటి ఘట్ రోడ్డు మీదుగా కిందికి దిగుతున్న టెంపో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది భక్తులు గాయపడ్డారు. కర్ణాటకలోని కోలార్‌కు చెందిన భక్తుల బృందం… శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో మొదటి ఘాట్ రోడ్డులో ఆరో మలుపు వద్ద వాహనం రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీ గోడను ఢీకొట్టి బోల్తాపడింది. ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో 13 మంది భక్తులు గాయపడినట్టు సిబ్బంది గుర్తించారు.
గాయపడిన భక్తులను హుటాహుటిన ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన భక్తులకు మెరుగైన చికిత్స అందించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. జేఈవో వీరబ్రహ్మం క్షతగాత్రులను రుయా నుంచి బర్డ్ హస్పిటల్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్డులో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈవో ధర్మారెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.