Shamirpet Road Accident: హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శామీర్ పేట ఓఆర్ఆర్ పై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై లియోనియా రిసార్ట్ వద్ద లారీ అదుపు తప్పి డివైడర్ దాటి కారుతోపాటు మరో వాహనాన్ని ఢీకొట్టింది.
దీనితో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాకుండా లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో క్లీనర్ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా మేడ్చల్ నుంచి కీసర వెళ్తున్న లారీ అదుపుతప్పి వాహనాలను ఢీకొని చెట్ల పొదలోక్కి దూసుకెళ్లింది.
ట్రాఫిక్ అంతరాయం(Shamirpet Road Accident)
ఈ ప్రమాదం ధాటికి లారీ, కారు ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకురి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మూడు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఓఆర్ఆర్ పై వాహనాల పోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు.