Crime News : బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన చెల్లి ప్రేమించిన యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు ఓ అన్న. ఆ తర్వాత ఆ భాగాలను కుక్కలకు ఆహారంగా వేశాడు. దేశ వ్యాప్తంగా ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… బిహార్ లోని నలంద జిల్లాకు చెందిన బిట్టు కుమార్.. ఈ నెల 16 న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కలా వెదికారు. తెలిసిన వాళ్ల ఇంట్లో ఆరా తీశారు. బంధువులకు ఫోన్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో రాహుల్ అనే యువకుడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిట్టు తన సోదరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయానని, అందుకనే అతడిని మట్టుబెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ నెల 16న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశానని అంగీకరించాడు.
ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశానని, మిగతా వాటిని నదిలో పడేశానని చెప్పాడు. అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.