Delhi Crime: దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మానవ మృగం నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 4 ఏళ్ల చిన్నారిపై.. స్కూల్ లో పనిచేసే ఫ్యూన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దారుణం..
దేశంలో మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. వాటి నియంత్రణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన.. మార్పు రావడం లేదు. అభంశుభం తెలియని చిన్నారులు పాలిట మృగాళ్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఎంత కఠినమైన.. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధులు జంకడం లేదు. మహిళలు, చిన్నారులపై దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట.. వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా దిల్లీలో నాలుగేళ్ల బాలికపై.. ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం దక్షిణ రోహిణి పోలీస్ స్టేషన్ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. రోహిణిలోని ఓ పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తున్న 43 ఏళ్ల వ్యక్తిని నాలుగేళ్ల బాలికపై వేధింపులకు పాల్పడినందుకు గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తెపై వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు బాలిక పోలీసులకు కొన్నివివరాలు చెప్పింది. వేధింపులకు గురిచేసిన వ్యక్తికి సంబంధించిన గుర్తులను చెప్పింది. దీని ఆధారంగా నిందితుడిని గుర్తించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 బీ, పోక్సో చట్టం సెక్షన్ 10 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.