Site icon Prime9

Guntur: ఉలిక్కిపడిన గుంటూరు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణ హత్య..!

murder in guntur

murder in guntur

Guntur: గుంటూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఓ దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కొందరు దుండగులు అత్యంత కిరాతంగా కత్తులు, వేటకొడవళ్ళతో వెంటాడి మరీ నరికేశారు. కళ్లముందే జరిగిన ఈ దారుణ హత్యను చూసిన జనం భయభ్రాంతులకు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే గుంటూరు నగరంలోని పట్నంబజార్‌ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సమీపంలోని బాబు హోటల్‌ వద్ద (ఏటుకూరి రోడ్‌) సుమారు రాత్రి 8 గంటల సమయంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది. మృతుడిని నల్లచెరువు ఆరోలైన్‌కు చెందిన దొడ్డి రమేష్‌(38)గా పోలీసులు గుర్తించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రమేష్ ఫైనాన్స్‌ వ్యాపారంతో పాటు శుభకార్యాలకు డెకరేషన్‌ పనులు కూడా చేస్తారు. కాగా మృతుడు రమేష్‌పై గుంటూరు లాలాపేట స్టేషన్‌లో రౌడీషీట్‌(ఏ కేటగిరి) నమోదయ్యి ఉంది. ఇతను గతంలో పాతగుంటూరులోని చాకలికుంట వద్ద జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు. కాగా రమేష్ హత్యకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం నగరంలో జల్లెడ పడుతున్నారు. నగరం నడిబొడ్డున జనం అందరూ చూస్తుండగా జరిగిన ఈ దారుణ హత్యతో ఒక్కసారిగా గుంటూరు ఉలిక్కిపడింది. ఈ ఘటన చూసిన వారంతా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

హత్యకు ముందు రమేష్‌ ఇంట్లోనే ఉన్నాడని, స్నానానికి నీళ్లు పెట్టేలోగా ఎవరో ఫోన్‌ చేసి పిలవగా బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడని మృతుడి తల్లి విలపిస్తూ తెలిపారు. ఇదిలా ఉండగా తన భర్తను బుడంపాడుకు చెందిన రౌడీషీటర్‌ ఆర్కే హత్య చేశాడని రమేష్‌ భార్య లత ఆరోపించారు. తన భర్తకు ప్రాణభయం ఉందని పోలీసులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆమె విలపించారు.

ఇదీ చదవండి: భార్య మార్పిడి క్రీడ.. కీచకుడిగా మారిన భర్త..!

Exit mobile version