Site icon Prime9

Kidnap Case : హైదరాబాద్ లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం… నిందితుడితో పాటు, 8 మంది అరెస్ట్ !

police-success-in-hyderabad-young-girl-kidnap-case

police-success-in-hyderabad-young-girl-kidnap-case

Kidnap Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన యువతి కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కిడ్నాప్ కి గురైన యువతిని సురక్షితంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 8మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది. పోలీసులు విజయవంతంగా 10 గంటల వ్యవధిలోనే ఈ కేసుని చేధించి యువతిని కాపాడారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని… ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు.

రాగన్నగూడకు చెందిన వైశాలి బీడీఎస్‌ పూర్తి చేసింది. ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా… నవీన్‌ రెడ్డి అనే యువకుడు వందమంది యువకులతో కలిసి వైశాలి ఇంటికి వచ్చి దాడి చేశాడు. అనంతరం వైశాలిని బలవంతంగా లాక్కెళ్లాడు. అడ్డు వచ్చిన యువతి త‌ల్లిదండ్రుల‌ను, చుట్టు పక్కల వారిని కూడా చిత‌క‌బాదారు.

యువతి ఇంటిని ధ్వంసం చేసి, ఆ యువ‌తిని ఎత్తుకెళ్లారు. అప్ర‌మత్త‌మైన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అంత‌లోపే యువ‌కులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే వైశాలి తన తండ్రితో ఫోన్ ద్వారా మాట్లాడడంతో ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేసి వాళ్లున్న చోటుని కనుక్కున్నారు. ఇక వెంటనే తమదైన శైలిలో నవీన్ రెడ్డిని పట్టుకొని వైశాలిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.

ప్రస్తుతం యువతి ప్రస్తుతం డీప్ షాక్ లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నవీన్ రెడ్డి యువతిని బాగా భయబ్రాంతులకు గురి చేశాడని పోలీసులు వెల్లడించారు. యువతిని కిడ్నాప్ చేశాక ఆమెపై దాడి కూడా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా గతంలో న‌వీన్ రెడ్డి వైశాలిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఐదారు నెల‌లుగా ఆ యువతిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు.

అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఈ సంబంధం తమకు ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం. తమ కూతురును నవీన్‌ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడని షీ టీమ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు యువతి తండ్రి తెలిపారు. ఇది మనసులో పెట్టుకుని నవీన్‌ ఈ కిడ్నాప్‌కు ప్లాన్‌ చేసినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది.

Exit mobile version