West Bengal: టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అక్రమ కార్యకలాపాల ద్వారా భారీ మొత్తంలో నగదు సంపాదించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది.
ఎస్‌ఎస్‌సీ స్కామ్‌లో డబ్బు సంపాదించడమే కాకుండా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు మరియు స్కామ్‌ల ద్వారా కూడా పార్థ ఛటర్జీ భారీగా డబ్బు సంపాదించినట్లు ఈడీ తెలిపింది. అతను ఈ డబ్బును అర్పితా ముఖర్జీ పేరు మీద దాచిపెట్టాడు. అందులో కోల్‌కతాలోని రెండు ప్రాంగణాల నుండి 49.8 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అర్పితా ముఖర్జీ తన ప్రాంగణంలో స్వాధీనం చేసుకున్న నగదు పార్థ ఛటర్జీకి చెందినదని ఈడీ పేర్కొంది. అర్పితా ముఖర్జీ నివాసంలో రికవరీ చేసిన సుమారు రూ. 50 కోట్ల నగదు పార్థ ఛటర్జీకి చెందినదని తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. పార్థ ఛటర్జీ నిరుపేద ప్రజలను దోపిడీ చేశారని, వారి అనుమతి లేదా తెలియకుండా షెల్ కంపెనీలకు డమ్మీ డైరెక్టర్లుగా చేశారని ఈడీ సమాచారం.
“డబ్బుకు బదులుగా ఉద్యోగాలను ఇచ్చే నేరపూరిత కార్యకలాపాల నుండి సంపాదించిన నిధులను లాండరింగ్ చేసే ఏకైక లక్ష్యంతో ఈ కంపెనీలు ఏర్పాటు చేసారు. పార్థ ఛటర్జీ నియంత్రణలో ఉన్న కంపెనీ అనంత టెక్స్‌ఫాబ్ అదే చిరునామాలో రిజిస్టర్ చేయబడింది. ఇక్కడ ఈడీ రూ. 27.90 కోట్ల నగదు మరియు రూ. 4.31 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. పార్థ ఛటర్జీ తన ఆధీనంలో ఉన్న కంపెనీలలో డమ్మీ డైరెక్టర్లను నియమించుకున్నారు. అవి అనంత టెక్స్‌ఫాబ్ ప్రైవేట్ లిమిటెడ్, సింబయాసిస్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వ్యూమోర్ హైరైజ్ ప్రైవేట్ లిమిటెడ్. అర్పితా ముఖర్జీ సెంట్రీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఎచ్చయ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల పేరుతో నిర్వహించబడుతున్న ఖాతాలలో నగదు జమ చేయడం మరియు ఆ తర్వాత కంపెనీల పేరుతో స్థిరాస్తులను కొనుగోలు చేయడం ద్వారా నిధులను లాండరింగ్ చేయడానికి ఉపయోగించారని ఈడీ వివరించింది. ఉద్యోగం పొందడానికి డబ్బు చెల్లించిన వ్యక్తుల వాంగ్మూలాలను కూడా ఈడీ రికార్డ్ చేసింది. అయితే వారిలో కొంతమందికి డబ్బు చెల్లించిన తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదు.