Site icon Prime9

Murder Case : పల్నాడు జిల్లాలో ఆస్తి కోసం అయిన వారినే హతమార్చిన వైనం.. పిన్ని, సోదరుడు, సోదరిని !

Murder News about killing women husband with synoid injections in peeleru

Murder News about killing women husband with synoid injections in peeleru

Murder Case : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులనే ఓ వ్యక్తి అతి కిరాతకంగా చంపడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది.  పొలంలో సగ భాగం రాసివ్వాలని తన పిన్ని, సోదరుడు, సోదరిని దారుణంగా చంపాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. ధూళిపాళ్లకు చెందిన పెద్దమీర్సా, చిన్నమీర్సా అన్నదమ్ములు. పెద్దమీర్సా కుటుంబం కొన్నేళ్ల కిందటే ఉపాధి నిమిత్తం సత్తెనపల్లిలో స్థిరపడింది. చిన్నమీర్సా కుటుంబం స్వగ్రామంలోనే జీవిస్తోంది. వీరిద్దరూ కొన్నాళ్ల కిందట మృతిచెందారు. చిన్న మీర్సాకు భార్య షేక్‌ రహిమున్నీసా(65), కుమార్తె మాలింబీ (36), కుమారుడు రహమాన్‌(38) ఉన్నారు. వీరికి రెండెకరాల పొలం ఉంది. ఆ పొలంపై పెద్దమీర్సా కుమారుడు ఖాసిం కన్నేశాడు.

పొలంలో సగభాగం రాసివ్వాలని తరచూ రహిమున్నీసాతో గొడవ పడేవాడు. బుధవారం మధ్యాహ్నం ఖాసిం తన కుమారుడైన బాలుడితో కలిసి సత్తెనపల్లి నుంచి ధూళిపాళ్లకు బయలుదేరాడు. దారిలో ఎదురైన రహమాన్‌పై దాడిచేసి చంపేసి, మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి ఓ దాబా వెనుక గుంతలో పడేశాడు. అనంతరం రహమున్నీసా ఇంటికి వెళ్లి, కర్రలతో దాడిచేశాడు. అడ్డువచ్చిన ఆమె కూతురు మాలింబీని విచక్షణారహితంగా కొట్టాడు. రహిమున్నీసా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన మాలింబీని సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాలింబీ తుదిశ్వాస విడిచింది. దాడి అనంతరం ఖాసిం, అతని కుమారుడు పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలానే రహమాన్‌ మృతదేహాన్ని కూడా గుర్తించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

 

Exit mobile version