Murder : 3 లక్షలు సుపారీ ఇచ్చి కన్న కొడుకునే చంపించిన తల్లిదండ్రులు.. ఎక్కడ ? ఎందుకంటే ??

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకునే సుపారీ ఇచ్చి మరి తల్లిదండ్రులే చంపించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఈనెల 10న జరిగిన ఈ హత్య ఉదంతాన్ని తాజాగా పోలీసులు చేధించారు. మొత్తానికి హత్య కేసులో తల్లిదండ్రులే హంతకులని తేల్చి..

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 07:28 PM IST

Murder : అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకునే సుపారీ ఇచ్చి మరి తల్లిదండ్రులే చంపించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఈనెల 10న జరిగిన ఈ హత్య ఉదంతాన్ని తాజాగా పోలీసులు చేధించారు. మొత్తానికి హత్య కేసులో తల్లిదండ్రులే హంతకులని తేల్చి.. పరారీలో ఉన్న వారిని, వారికి సహకరించిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన తనయుడు తాగుడుకు బానిసై.. డబ్బు కోసం తల్లిదండ్రులను వేధిస్తూ ఉండేవాడని.. అతటితో ఆగకుండా ఉన్న ఒక్క ఇల్లు అమ్మేయాలని.. వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించినట్లు తేలింది. జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం మెడికల్‌ కాలనీలో పగిల్ల రాము, సావిత్రి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరితో కుమారుడు దుర్గాప్రసాద్‌ ( 35 ), కోడలు మౌనిక కలిసి ఉంటున్నారు. మద్యానికి బానిసైన అతడితో విసిగిపోయిన.. మౌనిక పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. దీంతో దుర్గా ప్రసాద్ మరింత రెచ్చిపోయి ఇంకా ఎక్కువగా తాగడం మొదలుపెట్టాడు. తాగొచ్చిన ప్రతిసారి తల్లిదండ్రులను హింసిస్తూ తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. అంతటితో ఆగకుండా చివరికి ఉన్న ఇంటిని అమ్మేయాలని ప్లాన్ చేశాడు.

కొడుకు చిత్ర హింసలతో విసిగిపోయిన వారు.. అతన్ని హత్య చేయించేందుకు సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించారు. భద్రాచలానికే చెందిన గుమ్మడి రాజు, షేక్‌ ఆలీ పాషాకి 3 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి చంపేయాలని ఒప్పందం చేసుకున్నారు. పక్కా పథకం ప్రకారం.. ఈనెల 9న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న దుర్గాప్రసాద్‌ను సుపారీ గ్యాంగ్‌తో కలిసి తల్లిదండ్రులు గొంతు కోసి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని ఆటోలో తుమ్మలనగర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి పెట్రోలు పోసి తగలబెట్టేశారు.

ఆ తర్వాత తల్లిదండ్రులు, సుపారీ గ్యాంగ్‌లోని ఇద్దరు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇక మరుసటి రోజు అటుగా వెళ్ళిన స్థానిక వ్యక్తికి కాలిపోయిన మృతదేహాం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హత్యగా అనుమానించి ఎవరనే వివరాలు ఆరా తీశారు. మృతదేహం ఫొటోతో పాంప్లెట్లు వేయించి.. అన్ని చోట్ల అంటించారు. దుర్గాప్రసాద్‌ భార్య మౌనిక.. మృతదేహాన్ని గుర్తుపట్టి చనిపోయింది తన భర్తే అని పోలీసులను ఆశ్రయించింది. ఇక వారి విచారణలో నిజానిజాలు వ్యక్తం కావడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.