Palnadu Murder : పల్నాడు జిల్లాలో ఇటీవల కాలంలో పాత కక్షలు మళ్ళీ భగ్గుమంటున్నాయి. పాత కక్షలతో సహచరుణ్ని అత్యంత దారుణంగా నరికి చంపిన ఇప్పుడు సంచలనంగా మారింది. మృతదేహాన్ని 16 ముక్కలు చేసిన ఉదంతం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో చోటు చేసుకుంది. ఈ దారుణ సంఘటన గురించి పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల మేరకు..
అసలు ఏం జరిగిందంటే (Palnadu Murder) ..
దాచేపల్లికి చెందిన బొంబోతుల సైదులు, జి.కోటేశ్వరరావు నగర పంచాయతీలో ప్లంబర్లుగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు విద్యుత్తు మోటారును ఆపడానికి బైపాస్ ప్రాంతంలోని వాటర్ ట్యాంకు వద్దకు కోటేశ్వరరావు వెళ్లారు. అప్పటికే అక్కడ కాపు కాచిన సైదులు, అతడి కుమారుడు కలిసి ఇనుప రాడ్లతో కోటేశ్వరరావు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత మృతదేహాన్ని సంచిలో వేసి పాఠశాల సమీపంలోని తమ పొలం వద్దకు తీసుకెళ్ళి.. మృతదేహాన్ని 16 ముక్కలుగా నరికి ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
అయితే చాలా సేపు అయినప్పటికీ కోటేశ్వరరావు ఇంటికి రాకపోవడంతో.. కుటుంబీకులు అతని గురించి ఆరా తీశారు. అదే క్రమంలో ఎదురైన తండ్రీకుమారులను అడగగా.. తమకు తెలియదంటూ వెళ్లిపోయారు. పొలాల్లో మంటలను చూసి అక్కడికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించగా కాలిపోతున్న ఓ కాలు పాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బంధువులంతా కలిసి నిందితుల ఇంటికి వెళ్ళి చూసేసరికి వస్త్రాలు మార్చుకొని బయటకు వెళ్లడానికి వారు సిద్ధమయ్యారు.
కోటేశ్వరరావు ఏమయ్యారని నిలదీయగా.. సమాధానం దాట వేసేందుకు యత్నించారు. హత్య చేసి ఇంటికి వచ్చిన తండ్రీకుమారుల వస్త్రాలను సైదులు భార్య కోటమ్మ కాలుస్తూ కనిపించింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తర్వాత పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఘటనా స్థలంలోనే పంచనామా చేయించారు.
ఈ ఘటనపై మధ్యాహ్నం బాధిత కుటుంబీకులు, బంధువులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండు చేశారు. సీఐ నచ్చజెప్పి భరోసా ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఘటన జరిగిన తీరును బట్టి చూస్తే పథకం ప్రకారమే కోటేశ్వరరావును హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు. సైదులుపై గతం లోనూ పలు కేసులున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/