Junmoni Rabha: అస్సాంలో ‘లేడీ సింగం’ గా పేరు తెచ్చుకున్న మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ జున్ మోనీ రాభా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ తో పాటు మరో వీడియో వైరల్ అవ్వడమే అనుమానాలకు కారణమవుతోంది. మహిళా ఎస్ఐ రాభాను డిపార్ట్ మెంట్ లోని కొందరు అధికారులు చిత్రహింసలు పెట్టి చంపారని ఓ కానిస్టేబుల్ ఆడియో క్లిప్ ను విడుదల చేసినట్టు సమాచారం.
కాగా, రాభా మృతిని అనుమానాస్పద కేసుగా విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు.. సదరు కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు జున్ మోనీ కారు ప్రమాదం జరిగినపుడు.. ఆమె వాహనం ట్రక్కును ఢీ కొట్టలేదని.. ఆగి ఉన్న రాభా కారునే ట్రక్కు వచ్చి ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షిగా అని చెబుతున్న ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. అదే విధంగా ప్రమాదానికి ముందు ఇద్దరు వ్యక్తులు కారులో నుంచి దిగిపోయారని ఆ వ్యక్తి చెప్పడం ఇపుడు కలకలం రేపుతోంది.
కాగా, జున్ మోనీ రాభా మోరికొలాంగ్ పోలీస్ ఔట్ పోస్టు ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహించే వారు. ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి తన ప్రైవేటు కారులో ఆమె ప్రయాణిస్తుండగా.. అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో యూపీ నుంచి వస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని కారు ఢీకొట్టింది. జాఖలాబంధా స్టేషన్ పరిధిలోని సరుభుగియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. జున్మోనీని ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారు. అయితే, సివిల్ దుస్తుల్లో ఉన్న ఆమె.. ఆ సమయంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారన్న విషయం తెలియరాలేదని జిల్లా ఎస్పీ ఘటన జరిగిన రోజు వెల్లడించారు.
జున్ మోనీ రాభా విధుల్లో కఠినంగా వ్యవహరించే వారు. తనదైన పనితీరుతో ఆ ప్రాంతంలో ‘లేడీ సింగం’, ‘దబాంగ్ పోలీస్’గా పేరు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో ఆమె పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణలపై గత ఏడాది జూన్లో ఆమె అరెస్టు అయ్యారు. కొంతకాలం సస్పెన్షన్లో కూడా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆమె తిరిగి విధుల్లో చేరారు. అంతే కాకుండా ఓ భాజపా ఎమ్మెల్యేతో జరిపిన ఫోన్ ఆడియో క్లిప్ కూడా వివాదాస్పదమైంది.