JEE Advanced: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ లోని ఎస్వీఐటీ సెంటర్ లో ఎగ్జామ్ కు హాజరైన ఓ విద్యార్థి ఈ స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి..(JEE Advanced)
హైదరాబాద్ హైటెక్ సిటీ లోని ఓ కాలేజీలో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో ఎలాగైనా మంచి స్కోర్ చేయాలనుకున్నారు. అయితే అందుకోసం అడ్డదారి ఎంచుకున్నారు. పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ చేసేలా ప్లాన్ చేసుకుని ఓ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆదివారం జరిగిన పరీక్షకు ఎవరికి అనుమానం రాకుండా స్మార్ట్ ఫోన్లకు తీసుకెళ్లారు. ఈ నలుగురిలో టాపర్ అయిన చింతపల్లి చైతన్య కృష్ణ అనే విద్యార్థికి సికింద్రాబాద్ ప్యాట్నీలోని ఎస్వీఐటీ కాలేజ్ లో సెంటర్ పడింది.
అక్కడ పరీక్ష రాసిన ఆ విద్యార్థి..ఆన్సర్ సీట్లను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడు. వాటిని చూసుకుని ఎల్బీనగర, మల్లాపూర్, మౌలాలి లోని ఎగ్జామ్ సెంటర్లలో పరీక్షలు రాస్తున్న మిగిలిన విద్యార్థులు ఆన్సర్స్ కాపీ చేసుకున్నారు. ఈ క్రమంలో చైతన్య కృష్ణపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ అతన్ని చెక్ చేయగా ఫోన్ బయట పడింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. చైతన్య కృష్ణ ను అదుపులోకి తీసుకుని వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫ్రెండ్స్ కు ఆన్సర్స్ పంపినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదువులో టాపర్(JEE Advanced)
కాగా, జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడిన విద్యార్థి చదువులో టాపర్ అని సమాచారం. ఆ విద్యార్థికి టెన్త్లో 600/600, ఇంటర్ లో 940/1000 మార్కులు వచ్చినట్టు తెలుస్తోంది. ఫ్రెండ్స్ కు సాయం చేయాలనే ఉద్దేశంతో కాపీయింగ్ చేసినట్టు చైతన్య కృష్ణ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల నుంచి 35 వేల మంది
దేశంలోని 23 ఐఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీటెక్ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్ విధానంలో జరిపిన ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది హాజరయ్యారని అంచనా. ఈసారి కటాఫ్ మార్కులు సుమారు 60 గా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.