Hyderabad:హైదరాబాద్ నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. రీల్స్ సరదాతో ఓ విద్యార్థి(16) నిండు ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ ఘటన సనత్ నగర్ రైల్వే నగర్ లైన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..
ట్రాక్ పై ఇన్‌స్టా రీల్స్(Hyderabad)
సనత్‌నగర్ రైల్వే ట్రాక్ వద్ద ముగ్గురు స్నేహితులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ట్రాక్ పై ఇన్‌స్టా రీల్స్ చేస్తుండగా.. ఆ సమయానికి వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. దీంతో సర్ఫరాజ్(16) అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన విద్యార్థి రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో మదర్సాలో చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. అయితే, మరో ఇద్దరు విద్యార్థులు రైలు రావడాన్ని గమనించడంతో పక్కకు వెళ్లారు.
దీంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద లభించిన మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. సర్ఫరాజ్‌కు సోషల్ మీడియా ఖాతా ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.