Delhi psycho killer: ఢిల్లీలో పని చేస్తున్న రోజువారీ కూలీ అయిన రవీందర్ కుమార్‌కి ప్రతి రాత్రి చిన్న పిల్లల కోసం గంటల తరబడి వేటాడటం దినచర్యగా మారింది. వారిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన తరువాత చంపేసే వాడు. ఇటువంటి వారిని గుర్తిండానికి అతను ఢిల్లీలోని మురికివాడల గుండా మైళ్ళ దూరం నడిచేవాడు. ఇలా దాదాపు ఆరేళ్లపాటు 38 మంది పిల్లలతో ఇలా పదేపదే చేశాడు.
ఆరేళ్లపాటు మైనర్లపై అత్యాచారం..హత్య( Delhi psycho killer)
2008 మరియు 2015 మధ్య జరిగిన ఢిల్లీ, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ అంతటా కనీసం 38 మైనర్ పిల్లలపై అత్యాచారం మరియు హత్య కేసుల్లో నేరాన్ని అతను అంగీకరించాడు. వీటిలో కొన్ని నెక్రోఫిలియా (శవాలపై అత్యాచారం) కేసులు కూడా ఉన్నాయి. ఆరేళ్లపాటు ఘోరమైన నేరాలకు పాల్పడి ఎనిమిదేళ్లపాటు సాగిన విచారణ తర్వాత ఢిల్లీ కోర్టు శనివారం అతడిని దోషిగా నిర్ధారించింది.నిరుపేద, గ్రామీణ నేపథ్యంతో, రవీందర్ కుమార్ 2008లో 18 ఏళ్ల యువకుడిగా ఉద్యోగం వెతుక్కుంటూ ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ నుండి ఢిల్లీకి వచ్చాడు. మద్యం మరియు మాదకద్రవ్యాలు సేవిస్తూ వీటికోసం ఆదాయ ఉండాలని పనిచేయడం ప్రారంభించాడు. ఈ నేపధ్యంలో అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటు పడిన రవీందర్ బాలికల కోసం తిరగడం ప్రారంభించాడు.
పేదపిల్లలే టార్గెట్ ..
2008లో, ఢిల్లీలోని కర్లా ప్రాంతానికి చెందిన బాలికనుకిడ్నాప్ చేసిన రవీందర్ వరుస నేరాల్లో మొదటి నేరానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. అతను మొదటి సారి పట్టుబడకుండానే నేరం నుండి తప్పించుకున్నాడు, ఇది అతనిని రెండవ సారి మరియు మూడవ సారి చేయడానికి ప్రేరేపించింది. తర్వాత రవీందర్ కుమార్ నేరస్థుడిగా మారాడు.అతను ప్రత్యేకంగా వెనుకబడిన, పేద కుటుంబాలకు చెందిన పిల్లలను లక్ష్యంగా చేసుకుంటాడు, వారి అదృశ్యం, గుర్తించబడని అవకాశం ఎక్కువగా ఉంటుందని అతను ఊహించాడు. వారిని ఆకర్షించడానికి డబ్బు లేదా మిఠాయిలను ఉపయోగించేవాడు. ఆపై తన ప్రణాళికలను అమలు చేయడానికి వారిని పాడుబడిన లేదా నిర్జన ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. కొన్నిసార్లు, బాధితురాలిని నియంత్రించడం కష్టంగా ఉన్నప్పుడు, అతను మొదట హత్య చేసి, ఆపై పిల్లలపై అత్యాచారం చేసేవాడు.
ఒకరోజు రాత్రి 40 కిలోమీటర్లు నడిచాడు..
అతని బాధితుల్లో రెండేళ్ల వయస్సు నుంచి 12 సంవత్సరాల వరకు ఉన్నారు. వీరికోసం అతను ఒక రాత్రి అత్యధికంగా నడిచిన దూరం 40 కిలోమీటర్లు.2015లో హత్యాయత్నం చేసి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో రవీందర్ కుమార్ తొలిసారి పోలీసుల దృష్టిలో పడ్డాడు. అప్పుడు బేగంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా కేసును విచారించిన మాజీ ఏసీపీ జగ్మీందర్ సింగ్ దహియా, విచారణ సమయంలో రవీందర్ కుమార్ తన ప్రతి నేరాన్ని వివరంగా చెప్పాడని అన్నారు.అతను నేరాలకు పాల్పడిన కనీసం 15 చోట్ల పోలీసులను కూడా తీసుకెళ్లాడు.
2015లో రవీందర్ కుమార్‌పై దాఖలైన కేసులో రోహిణి కోర్టు శనివారం అతడిని దోషిగా నిర్ధారించింది. అతను అనేక హత్యలకు పాల్పడినట్లు అంగీకరించాడు. మరో రెండు వారాల్లో కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.