Suicide: ఏపీలోని సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ బాలిక బలైంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రబెల్లి గ్రామంలో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకున్న టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ తనను లైంగికగా వేధించాడని, ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో బాలిక తెలిపింది. ప్రేమ పేరుతో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇంతియాజ్.. చెప్పినట్లు చేయకపోతే మార్ఫింగ్ ఫోటోలు ఆన్‌లైన్‌లో ఉంచుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు మైనర్ బాలిక బలయిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. నిందితుడు రాళ్లపల్లి ఇంతియాజ్ వేధింపులు భరించలేక సుధారాణి అనే మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమని అన్నారు. అనంతపురం జిల్లాలో టిడిపి నాయకుల వరుస అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినపుడు టిడిపి సీరియస్ గా స్పందించివుంటే తిరిగి ఇలాంటివి పునరావృతం అయ్యేవి కాదని.. ఆలోచించమని చంద్రబాబుకు మహిళా కమిషన్ తరపున సూచన చేస్తున్నానని పద్మ అన్నారు. విజయవాడలో వినోద్ జైన్ ఉదంతం, టిడిపి కార్యాలయంలో లోకేష్ పిఏ అఘాయిత్యం మహిళ ఆరోపణలపై టిడిపి కఠినంగా వ్యవహరించాల్సిందని అన్నారు. కానీ ఇలాంటి ఘటనలపై చంద్రబాబు స్పందన సరిగ్గా లేదన్నారు. టీడీపీ నేతల వేధింపులకు కారణం చంద్రబాబు వెనుకేసుకురావడమే అని అన్నారు. ఇలాంటి ఘటనలను మహిళా కమిషన్ సహించే ప్రసక్తే లేదని తగిన గుణపాఠం తప్పదని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.