Muzaffarpur: బీహార్‌లోని ముజఫరాపూర్ పట్టణంలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 14 లక్షల రూపాయలు దోచుకుపోయారు. సదర్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోబర్‌షాహి బ్రాంచిలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు దుండగులు ఆయుధాలతో బ్యాంకులో ప్రవేశించి ముందుగా క్యాషియర్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. క్యాషియర్ వద్ద ఉన్న 14 లక్షల రూపాయలతో పాటు ఇద్దరు కస్టమర్ల నుంచి 71వేల రూపాయలు దోచుకుని పారిపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు సీసీ కెమెరాలను పరిశీలించారు. నగరం మొత్తం దిగ్బందం చేసి వాహనాలను సోదా చేస్తున్నట్లు నగర్ డీఎస్‌పీ రామ్‌నరేశ్ పాశ్వాన్ చెప్పారు. గోబర్‌షాహి ప్రాంతంలో తరచూ దోపిడీలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గతంలో ఎస్‌బీఐ ఏడీబీ బ్రాంచీలో కూడా దొంగతనం జరిగిందని ఆయన తెలిపారు. అంతకు ముందు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి 26 కిలోల బంగారం చోరి జరిగిందని ఆయన అన్నారు. కాగా ముజఫరాపూర్ పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలను వీలైనంత త్వరగా పట్టుకుంటామని డీఎస్‌పీ రామ్‌నరేశ్ తెలిపారు.