Somalia: సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు జంట పేలుళ్ల ఘటన తీవ్ర విషాదాన్ని మరియు భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది మరణించారు. విద్యా మంత్రిత్వ శాఖ భవనం సమీపంలోని రద్దీగా ఉండే జంక్షన్ వద్ద శనివారం నాడు ఈ దాడి చోటుచేసుకుంది.
మొగదిషులో నిమిషాల వ్యవధిలోనే వరుస కారు బాంబు పేలుళ్లు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో 100 మంది మరణించగా మరో 300 మందికి పైగా గాయపడ్డారని సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహముద్ తెలిపారు. క్షతగాత్రులకు అంతర్జాతీయ వైద్య సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యా మంత్రిత్వ శాఖను లక్ష్యంగా చేసుకునే అల్-షబాబ్ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా ఈ దాడిని అమెరికా, టర్కీ, ఖతార్, జర్మనీ దేశాలు తీవ్రంగా ఖండించాయి.
ఇకపోతే అల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ఫెడరల్ సోమాలియా ప్రభుత్వంపై ఇప్పటికే పలుసార్లు దాడులకు పాల్పడింది. అయితే ఈ బాంబు దాడులకు బాధ్యులని ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదు. అయితే ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఇతర దాడులకు అల్-షబాబ్ బాధ్యత వహించిన నేపథ్యంలో ఈ దాడి కూడా ఆ సంస్థ చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఉగ్రదాడి మమ్మల్ని నిరుత్సాహపరచదు. ఇది వారిని ఓడించాలనే మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని ఆ దేశ అధ్యక్షుడు మొహముద్ పేర్కొన్నారు. ఇకపోతే దాదాపుగా ఇదే ప్రాంతంలో 2017 అక్టోబర్ 14న జరిగిన ఘోర బాంబు దాడిలో 500 మందికి పైగా మరణించారు.
ఇదీ చదవండి: ఒకేసారి 100 మందికిపైగా గుండెపోటు.. 149 మంది మృతి