Mumbai: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. రెపో రేట్ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో రెపో రేట్ 5.40 నుంచి 5.90 శాతానికి పెరిగింది. కాగా, గడిచిన ఐదు నెలల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. రెపో రేట్ పెరగడం వలన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయని ఆర్బీఐ పేర్కొంది.
బ్యాంకులు రుణగ్రస్తులకు అందించే రుణాల వడ్డీ రేట్లను పెంచనున్నాయి. తద్వారా హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ ఇలా బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ల పై నెలవారీ చెల్లించే ఈఎంఐ మరింత పెరగనుంది. బ్యాంకులకు ఇచ్చే రుణాల పై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేట్లను రెపోరేట్లు అని అంటారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ రెపోరేట్లను పెంచుతూ వస్తుంది. ఇలా మే నెలలో 0.40శాతం, జూన్, ఆగస్టులో 0.5శాతం, శుక్రవారం మరో 0.5శాతం పెంచాయి. కాగా, ఆర్‌బీఐ రెపో రేట్లను పెంచిన ప్రతిసారి, బ్యాంకులు ఇచ్చే లోన్‌ల పై వడ్డీ రేట్లను పెంచుతాయి.
ద్రవ్యోల్బణం భయాలతో వడ్డీ రేట్లను పెంచడం ఆర్‌బీఐకి అనివార్యంగా మారింది. బుధవారం నుంచి రెండు రోజుల పాటు సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ శుక్రవారం తన నిర్ణయాలను ప్రకటించింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు పెరగడం నాలుగోసారి కావడం గమనార్హం.