Jio cinema: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల్లో రిలయన్స్ కు చెందిన ‘జియో సినిమా’వ్యూవర్స్ లో కొత్త రికార్డును నమోదు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో వీక్షించారు. దీంతో జియో సినిమా వ్యూవర్స్ లో కొత్త చరిత్రను నెలకొల్పింది. ఫైనల్ మ్యాచ్ ను ఒకేసారి 3.2 కోట్ల మంది చూశారు. దీంతో ఇప్పటి వరకు 2.57 కోట్లుగా ఉన్న వ్యూవర్ షిప్ 3.2 కోట్లకు చేరింది.
హాట్‌స్టార్ రికార్డును తిరగరాసి(Jio cinema)
తొలిసారి ఐపీఎల్ సీజన్ 2023 ప్రసారాలను జియో సినిమా ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. అన్ని టెలికాం నెట్‌వర్కులకు ఈ ఐపీఎల్ సీజన్ ఉచితంగా వీక్షించే అవకాశం ఇచ్చింది. ఇదే జియో సినిమాకు బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కొత్త రికార్డులను నమోదు చేస్తూ వచ్చింది. 2019 ఐపీఎల్ సీజన్‌లో 2.5 కోట్ల మంది వీక్షించారు. చాలా రోజుల పాటు హాట్‌స్టార్ పేరుతో రికార్డు కొనసాగింది. ఇపుడు ఆ రికార్డును జియో సినిమా తిరగరాసింది.
Congratulations #CSK on making it a perfect 🖐️ – 🏆🏆🏆🏆🏆
It is #Yellove all over & we are loving it!💛#IPLonJioCinema #TATAIPL #Dhoni #IPLFinal #CSKvGT pic.twitter.com/YXD4aYOZls
— JioCinema (@JioCinema) May 30, 2023
చెన్నై మ్యాచ్‌లకే ఎక్కువ(Jio cinema)
లీగ్ దశలో ఏప్రిల్ 12న జరిగిన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను 2.2 కోట్ల మంది వీక్షించారు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై మధ్య ఏప్రిల్ 17న చిన్నస్వామి వేదిగా జరిగిన మ్యాచ్‌ను 2.4 కోట్ల మంది చూశారు. గుజరాత్ టైటాన్స్, ముంబై మధ్య జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌ను ఎక్కువగా 2.57 కోట్ల మంది వీక్షించారు. దీంతో హాట్ స్టార్ రికార్డు బ్రేక్ అయింది. తాజాగా సోమవారం ఉత్కంఠగా సాగిన గుజరాత్, చెన్నై మ్యాచ్‌ను 3.25 కోట్ల మంది చూశారు. ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ సోమవారానికి వాయిదా పడినా ఈ స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. సోమవారం వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ఆలస్యం జరిగింది. అదే ఈ ఆలస్యం జరగకపోయి ఉంటే వ్యూస్ ఇంకా ఎక్కువగా వచ్చేవి. ఓవరాల్ గా ఈ సీజన్ లో మిగతా మ్యాచ్ లతో పోలిస్తే చెన్నై మ్యాచ్‌ల పట్ల క్రికెట్ అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపారు.