Ibrahimpatnam DPL Surgeries Case: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నంలో జరిగిన సంగతి విదితమే. కాగా ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం సీరయస్ అయ్యింది. దీనికి బాధ్యులయిన పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది. మరికొందరిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించడానికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మి, డీసీహెచ్ఎస్ ఝాన్సీ లక్ష్మిలపై బదిలీ వేటు వేసింది. వీరిరువురితో సహా మొత్తం 13 మంది వైద్య సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. బాధ్యులపై చర్యలతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతూ వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇబ్రహీంపట్నం దవాఖానకు సంబంధించిన డీపీఎల్ క్యాంపు ఆఫీసర్ డాక్టర్ నాగజ్యోతి, డిప్యూటీ సివిల్ సర్జన్ డా. గీత, హెడ్ నర్స్ చంద్రకళతోపాటు మాడుగుల పీహెచ్‌సీ డా. శ్రీనివాస్, సూపర్‌వైజర్లు అలివేలు, మంగమ్మ, మంచాల పీహెచ్‌సీ డా. కిరణ్, సూపర్‌వైజర్ జయలత, దండుమైలారం పీహెచ్‌సీ డా. పూనం, సూపర్‌వైజర్ జానకమ్మ వీరంతా ప్రభుత్వం చర్యలు తీసుకువాలని ఆదేశించిన వారి లిస్టులో ఉన్నారు.
ఇకపోతే రంగారెడ్డి జిల్లా హాస్పిటళ్ల వైద్య సేవల కోర్డినేటర్ (డీసీహెచ్‌ఎస్) ఝాన్సీ లక్ష్మిని బదిలీ చేసిన ఆరోగ్య శాఖ అధికారులు, షాద్‌నగర్ దవాఖానలో రిపోర్ట్ చేయాలని ఆమెను ఆదేశించారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరదాచారికి రంగారెడ్డి డీసీహెచ్‌ఎస్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. క్రికెట్ లవర్స్ కోసం సెప్టెంబర్ 25న అదనపు రైళ్లు