Amaravathi: రాజ్యసభ సభ్యత్వం, వక్ప్ బోర్డ్ చైర్మన్ , ఎమ్మెల్సీ ఇలా సినీ నటుడు అలీకి జగన్ ఏ పదవి ఇస్తారన్న దానిపై గత కొద్దికాలంగా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. చివరకు ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. రెండేళ్ల పాటు పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి చాలమంది సలహాదారులు ఉన్నారు. ఇపుడు వారి జాబితాలో అలీ కూడా చేరిపోయారు
అలీ 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు. అప్పట్లో ఎమ్మెల్యే సీటు ఆశించినా సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో వైసీపీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలీ చేత ప్రచారం చేయించింది వైసీపీ. దీంతో పార్టీ అధికారంలోకి వస్తే అలీకి మంచి పదవి ఖాయం అంటూ ప్రచారం జరిగింది కూడా. కానీ, అది జరగలేదు. రెండుమూడు సార్లు సీఎం జగన్ ను కలిసిన అలీ తనకు ఏ పదవి ఇవ్వాలో జగన్ నిర్ణయిస్తారని అన్నారు. ఈ లోపు అలీకి రాజ్యసభ సభ్యత్వం ఖాయమని ప్రచారం జరిగింది కాని రాలేదు. ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లయినా ఎటువంటి పదవి దక్కకపోవడంపై అలీ నిరుత్సాహంగా ఉన్నారని సమాచారం. దీనితో ఇటీవల అలీ పార్టీ మారుతారనే ప్రచారం కూడ జరిగింది. అయితే అలీ దానిని ఖండించారు.
రాజకీయంగా ఎటువంటి పదవి ఇవ్వలేని నేపధ్యంలో అటువంటి వారికి వైసీపీ ప్రభుత్వం సలహాదారు పదవిని ఇస్తోంది. ఇటువంటి సలహాదారులు చాలమందే ఉన్నారు. వారికి మూడు లక్షలరూపాయలదాకా చెల్లిస్తారు. వీరు సలహాలు ఇచ్చేదీ లేదు.. పొరపాటున ఇచ్చినా జగన్ తీసుకునేది లేదు. ఏదోరకంగా తనను నమ్ముకున్న వారికి రాజకీయ పునరావాసం కల్పించాలనేదే జగన్ భావన. మొత్తంమీద ఎలాగయితేనేమి అలీకి ఒక పదవి దక్కింది.