Prime9

MLC Ruhullah : బైక్ ని ఢీ కొట్టిన ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా కారు.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

MLC Ruhullah : విజయవాడలో వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా కారు బీభత్సం సృష్టించింది. స్థానిక బీఆర్టీఎస్ రోడ్ లో అర్ధరాత్రి 2:30 గంటలకు ఎమ్మెల్సీ కారు.. బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో  ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గుణదల పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం లక్ష్మణ్ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

స్థానికులు అందించిన సమాచారం మేరకు ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా ప్రధాన అనుచరుడు జమీర్.. ఎమ్మెల్సీ స్టిక్కర్ కలిగిన కారులో బయటకు వచ్చాడు. విజయవాడ బిఆర్టిఎస్ రోడ్డులో శనివారం అర్థరాత్రి 2గంటల సమయంలో కారులో వేగంగా వెళుతుండగా.. కారు అదుపుతప్పి ర్యాపిడో బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్న లక్ష్మణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే కారు కూడా ఆగిపోవడంతో ఎమ్మెల్సీ రుహుల్లా అనుచరులు కారుకు వున్న ఎమ్మెల్సీ స్టిక్కర్ తొలగించి జమీర్ ఘటనాస్థలి నుంచి పరారయ్యారు అని చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసమవ్వగా.. కారు ముందుభాగం దెబ్బతింది. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు గుణదల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక మరోవైపు ప్రమాదానికి కారణమైన కారు తనది కాదని ఎమ్మెల్సీ రుహుల్లా చెబుతున్నారు. అసలు ప్రమాదం జరిగిన విషయం కూడా తనకు తెలియదని ఆయన అంటున్నారు. కారు తనదేనని పోలీసుల విచారణలో తేలితే ఏ యాక్షన్ తీసుకున్నా సిద్దమేనని రుహుల్లా తెలపడం గమనార్హం.

Exit mobile version
Skip to toolbar