Nithari killings: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ హత్యలకేసులో నిందితులు సురేంద్ర కోలీ, మోనీందర్ సింగ్ పంధేర్ ఇద్దరిని నిర్దోషులుగా అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున వీరిద్దరిని నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.
హత్యచేసి అత్యాచారాలు.. ( Nithari killings)
2006 డిసెంబర్ లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని నిఠారీలో జరిగిన భయంకరమైన నేరాలు వెలుగులోకి వచ్చాయి.మోనీందర్ సింగ్ పంధేర్ నివాసంలో మరియు చుట్టుపక్కల ఉన్న అనేక మానవ అవశేషాలు బయటపడటం సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడ్డాయి. పంధేర్ నివాసంలో పనిచేసే కోలీ పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు అందజేసి ఇంటికి రప్పించేవాడు. ఆ తర్వాత వారిని హత్య చేసి, వారి శవాలతో లైంగిక సంబంధం పెట్టుకుని, వాటిని ముక్కలు చేసి, శరీర భాగాలను వండుకుని తినేవారు . అనంతరం వారి ఎముకలు మరియు ఇతర శరీర భాగాలను ఇంటి వెనుక కాలువ లేదా పెరట్లోకి విసిరేవారు. బాధితుల్లో కొందరు యువతులు కూడా ఉన్నారు. దీనితో కోలి, పంధేర్ పై 19 కేసులు నమోదు చేసారు. తరువాత సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మూడింటిని మూసేసారు. కోలీపై మొత్తం 16 కేసులు నమోదు కాగా, వాటిలో పన్నెండు కేసుల్లో అతనికి మరణశిక్ష పడింది.
నిఠారీ వరుస హత్యల కేసులలో పంధేర్ దోషిగా నిర్ధారించబడి మరికొన్నింటిలో నిర్దోషిగా విడుదలయ్యాడు. రెండు కేసుల్లో ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను పంధేర్ అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు.ట్రయల్ కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు నిందితుడు సురేంద్ర కోలీపై ఉన్న 12 కేసుల్లో నిర్దోషి గా, సహ నిందితుడు మోనీందర్ సింగ్ పంధేర్ ను మరో రెండు కేసుల్లో నిర్దోషిగా నిర్ధారించింది.