Site icon Prime9

Ys Bhaskar Reddy Arrest : వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్..

mp avinash reddy father ys-bhaskar-reddy-arrest- in viveka murder case

mp avinash reddy father ys-bhaskar-reddy-arrest- in viveka murder case

Ys Bhaskar Reddy Arrest : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు మెమో అందజేసి ఆయన్ను అరెస్ట్‌ చేశారు. సీబీఐ అధికారులు వచ్చిన విషయాన్ని తెలుసుకుని అవినాష్‌రెడ్డి అనుచరులు, వైకాపా కార్యకర్తలు భారీ సంఖ్యలో భాస్కర్‌రెడ్డి నివాసం వద్దకు తరలి వచ్చారు. అరెస్ట్‌ అనంతరం భాస్కర్‌రెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారుల వాహనాలను అవినాష్‌ అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు.

వివేకా హత్య కేసులో రెండు రోజుల క్రితం ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్యకు ముందు భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉదయ్‌ ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా సీబీఐ గుర్తించింది. ఉదయ్ కుమార్ ను గత శుక్రవారమే కడపలో అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు హైదరాబాద్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు జడ్జి. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

మరోవైపు కుటుంబ పరంగా, రాజకీయంగా విబేధాల నేపథ్యంలో సొంత బాబాయ్ వివేకాను అవినాష్ రెడ్డి హత్య చేయించాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సానుభూతి కోసం సీఎం జగన్ కూడా వివేకా హత్యకు సహకరించినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివేకా కూతురు సీబీఐ విచారణను కోరారు. దీంతో ఏపీ పోలీసుల చేతి నుండి ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లడంతో విచారణ స్పీడ్ అందుకుంది.

ఇక ఇప్పటికే వివేకాను హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని పలుమార్లు సిబిఐ విచారించింది. అంతే కాకుండా గూగుల్ టేకౌట్ ద్వారా వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో దేవినేని శివశంకర్ రెడ్డి, ఉధయ్ కుమార్ రెడ్డి వున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఉదయ్ కుమార్ కు కూడా వివేకా హత్యతో సంబంధాలున్నాయని అనుమానిస్తూ సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే అవినాష్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో వుండటంతో ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. తొలుత హైదరాబాద్‌లోని అవినాష్‌రెడ్డి ఇంటికీ సీబీఐ అధికారులు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయితే అక్కడికి ఎవరూ రాలేదని ఎంపీ సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.

 

Exit mobile version