Kamareddy News : ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ కొందరు మోసగాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. ఫైనాన్స్ సంస్థ పేరుతో లోన్లు ఇస్తామని చెప్పి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో రుణాలు ఇప్పిస్తామంటూ… ఇద్దరు మోసగాళ్లు ప్రజల్ని మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీస్ అధికారులు వాళ్ళని పట్టుకొని తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
శ్రీ సాయి ఎంటర్ ప్రైజేస్ & ఫైనాన్స్ పేరుతో ఇద్దరు పర్సనల్ లోన్ పేరుతో ప్రచారం చేశారు. రూ.50 వేలు, ఒక లక్ష రుణం ఇస్తామని మహిళా గ్రూపులు ఏర్పాటు చేశారు. పిట్లం మండల కేంద్రమే కాకుండా మండలం లోని పలు గ్రామాల్లో 80 పైసల వడ్డీకే రుణం ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేసి గ్రామస్తుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు. వారి చేతుల్లో మోసపోయిన బాధితులు మాట్లాడుతూ… ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామని… లోన్ కావాలంటే ముందుగా రూ. 4 వేలు కట్టి మిక్సర్ తీసుకోవాలని, మీకు మిక్సర్ వద్దంటే మేము లోన్ ఇచ్చిన తర్వాత మిక్సర్ తిరిగి తీసుకొంటామని అన్నారు. బాధితులు వారి మాటలను నమ్మి మిక్సర్ లు తీసుకున్నారు.
ఇక 2 తర్వాత మళ్ళీ… లోన్ కు ఇన్సూరెన్స్ ఉందని దాని కోసం రూ. 4 వేలు కడితే మా మేనేజర్ వచ్చి మీకు లోన్ డబ్బులు ఇస్తారని చెప్పారు. దీంతో బాధితులు వారి మాటలను నమ్మి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టారు. అయితే మోసగాళ్ళు ఈ నెల 14వ తేదీన మా మేనేజర్ తో వచ్చి మీకు లోన్ డబ్బులు ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు. 14వ తేదీన వారు రాకపోయే సరికి బాధితులు వాళ్లకు పోన్ చేస్తే పోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలిపారు. కేటుగాళ్ల ఫోన్లు పనిచేయక పోవడంతో ఇదంతా ఫేక్ అని బాధితులు గ్రహించారు. ఇక చివరికి తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది.