Site icon Prime9

Telugu CMs’ Meet: అందరి చూపు అటువైపే.. నేడు హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

Telugu CMs' Meet

Telugu CMs' Meet

Telugu CMs’ Meet: సుదీర్ఘ కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఇవాళ భేటీ కాబోతున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ ఇందుకు వేదిక కాబోతోంది. ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటికి అత్యంత ప్రాధాన్యత నెలకొంది. వీరిద్ధరి సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. విభజన సమస్యలపై సమావేశమవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం, అందుకు రేవంత్‌రెడ్డి స్పందిస్తూ చంద్రబాబును ఆహ్వానించారు. దీంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎంల మధ్య సమావేశం ప్రారంభం కానుంది.

సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్గ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర శాఖల అధికారులు పాల్గొంటుండగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, సీఎస్‌ నీరబ్‌కుమార్‌, ఆర్థికశాఖ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

సుహృద్భావ వాతావరణంలో ఈ భేటీ జరుగుతున్నందున కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. గతంలో అప్పటి సీఎంలు కేసీఆర్‌, వైఎస్‌ జగన్ మధ్య జరిగిన చర్చలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత సీఎంల మధ్య జరుగుతున్న ఈ సమావేశం సక్సెస్ కావాలని అటు ప్రజలు ఇటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. ప్రతిసారీ పేచీ పెట్టుకునే బదులు..ఎలాంటి చిక్కుల్లేని కొన్ని సమస్యలనైనా పరిష్కరించుకుంటే బాగుటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే విభజన చట్టంలో లేనివి, ఇప్పటిదాకా చర్చకు రాని కొన్ని కొత్త అంశాలను కూడా సీఎంల భేటీలో తెలంగాణ లేవనెత్తనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

విభజన సమస్యలే ప్రధాన ఎజెండా..(Telugu CMs’ Meet)

ఇద్దరు సీఎంల సమావేశంలో విభజన సమస్యలే ప్రధాన ఎజెండా కానున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లోని 9వ, 10వ షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీలపై చర్చించనున్నారు. షెడ్యూలు 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా..వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలా భిడే కమిటీని నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ 89 సంస్థల విభజన సిఫారసులకు అంగీకరించింది. కానీ, తెలంగాణ మాత్రం వీటిలో 68 సంస్థల విభజన సిఫారసులను మాత్రమే ఒప్పుకొంటోంది. దీనిపై సీఎంలు చర్చించనున్నారు. ముఖ్యంగా APSRTC, ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయింది. ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కోల విద్యుత్తు బకాయిల పేచీ ఎటూ తెగడం లేదు. రాష్ట్రావతరణ అనంతరం 2014 జూన్‌ 2వ తేదీ నుంచి 2017 జూన్‌ 10వ తేదీ వరకు ఏపీ జెన్‌కో నుంచి తీసుకున్న విద్యుత్తుకుగాను 3,441 కోట్లను సకాలంలో చెల్లించనందుకు ఆలస్య రుసుము సర్‌చార్జి కింద మరో 3,315 కోట్లు చెల్లించాలని ఏపీ అడుగుతోంది.

హైదరాబాద్‌లోని కొన్ని భవనాల పరిస్థితి ఎటూ తేలడం లేదు. వీటిపై రెండు తెలుగు రాష్ట్రాలు పట్టుపడుతున్నాయి. సీఐడీ హెడ్‌ క్వార్టర్స్‌, లేక్‌వ్యూ అతిథి గృహం, హెర్మిటేజ్‌ కార్యాలయ భవనం వంటి వాటిని జనాభా దామాషా 58.32, 41.68 ప్రకారం పంచాలని ఏపీ కోరుతోంది. అయితే ఇందుకు తెలంగాణ అంగీకరించడం లేదు. పాత సెక్రటేరియట్‌లో ఉన్న భవనాలు, స్థలాన్ని, అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనసభ, శాసనమండలి భవనాలను 2019లోనే తెలంగాణకు ఏపీ అప్పగించింది. మార్చి నెలలో సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో ఢిల్లీలోని ఏపీ భవన్‌ వివాదం కూడా పరిష్కారమైంది. ఏపీ భవన్‌కు సంబంధించిన పటౌడీ హౌస్‌, నర్సింగ్‌ హాస్టల్‌ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ మార్చి 15న తుది నిర్ణయాన్ని ప్రకటించగా..ఇందుకు రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. మరోవైపు మైనింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి కూడా విడిపోయింది.

Exit mobile version