Site icon Prime9

Great Wall of India: ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా.. దీని గురించి మీకు తెలుసా?

rajasthan

rajasthan

Great Wall of India: ప్రపంచంలో పొడవైన గోడ అనగానే ప్రతి ఒక్కరు చెప్పే పేరు ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఈ చైనా వాల్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన వింతల్లో ఒకటి. కానీ అలాంటిదే ఇండియాలోను ఓ గోడ ఉందని మీకు తెలుసా?.. ఎప్పుడైనా దీని గురించి విన్నారా?. మన దేశంలోనూ ఒకటి ఉందంటే మీరు నమ్ముతారా!. పర్యాటకులు ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా పిలుచుకునే గోడ కుంభాల్ గడ్ అని మీకు తెలుసా?.

దీని పొడవు ఎంతో తెలుసా! (Great Wall of India)

రాజస్థాన్‌ రాష్ట్రంలోని కుంభాల్‌గడ్‌ కోట ద గ్రేట్‌ వాల్‌  ఆఫ్‌ ఇండియాగా పేరొందింది. రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్ సమంద్ జిల్లాలో కుంభాల్‌గడ్‌ కోట గోడ ఉంది. ఆరావళి పర్వతాలకు పశ్చిమశ్రేణిలో.. దాదాపు 36 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఈ గోడను నిర్మించారు. పదమూడు ఎత్తయిన పర్వతాలు కోట చుట్టూ ఉంటాయి. ఉదయ్‌పుర్‌ కు ఈ ప్రాంతం సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని మేవాడ్‌ రాజు రాణా కుంభ నిర్మించాడు. ఆయన పేరు మీదుగానే ఈ కోటకు కుంభాల్ గడ్ అనే పేరు వచ్చింది. ఎంతో ఘన కీర్తి గల ఈ కోట ఆనవాళ్లు.. 3వ శతాబ్దం నుంచే ఉన్నట్లు అక్కడి చరిత్రకారులు చెబుతారు. 14వ శతాబ్దం నాటికి అల్లావుద్దీన్‌ ఖిల్జీ తన సామ్రజ్యాన్ని విస్తరించాడు. ఆ సమయంలో ఉప ఖండంలో ఖిల్జీ పలు రాజ్యాలను జయిస్తూ వస్తున్నాడు. రాజస్థాన్‌ లోని చాలా భూభాగాన్ని ఖిల్జీ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. ఆ సమయంలో మేవాడ్‌ ఆక్రమణ కోసం తీవ్రంగా యత్నించాడు. ఎలాంటి ఇబ్బందులు రాకుడదని.. రాణా కుంభ్‌ 15వ శతాబ్దంలో మేవాడ్‌, మార్వార్‌ను వేరు చేసేలా ఒక పెద్ద గోడను నిర్మించాలని సంకల్పించాడు. ఆ పని వేగంగా పూర్తి కావాలని తన పరివారాన్ని ఆదేశించడంతో ఒకటిన్నర దశాబ్ద కాలంలోనే కోట గోడను పూర్తి చేశారు. రాణా కుంభ్‌ దాదాపు 32 కోటలు నిర్మించగా.. అందులో కుంభాల్‌గడ్ అతిపెద్దది.

సాధువు ఆత్మార్పణతో

చరిత్రకారుల ప్రకారం.. రాణా కుంభ్‌ కేలివాడలో కోటను నిర్మించాలని సంకల్పించాడు. ప్రస్తుతం కోట ఉన్న ప్రదేశానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎప్పుడు నిర్మాణం మొదలు పెట్టినా అది కూలిపోతూ ఉండేది. దీనికి పరిష్కార మార్గం చూపాలని.. ఓ సాధువును కోరాడు. నరబలి ఇస్తే నిర్మాణం సాఫీగా సాగుతుందని ఆ సాధువు చెప్పాడు. ఇది తెలిసి తమను తాము బలి ఇచ్చుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో సాధువే తాను బలయ్యేందుకు సిద్ధం అన్నాడు. అయిష్టంగానే సాధువు నిర్ణయాన్ని రాణా కుంభ్‌ అంగీకరించాడు. సాధువు చెప్పిన ప్రకారం ఆయన ఆగిన తొలిచోట ప్రధాన ద్వారం, రెండోసారి ఆగిన చోట దేవాలయం, సాధువు పూర్తిగా పడిపోయిన చోట కోట గోడ ఆఖరి పాయింట్‌ను నిర్మించారు.

అద్భుత నిర్మాణం కుంభాల్ గడ్..

ఈ కోట నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. మెలికలు తిరుగుతూ కన్పించే కుంభాల్‌ కోట గోడ మేఘాలను తాకుతున్నట్లుగా ఉంటుంది. ఈ గోడ సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉంటుంది. రాణా కుంభ్‌ ఆస్థానంలో పని చేస్తున్న రచయిత, సిద్ధాంత కర్త కోట నిర్మాణానికి కావాల్సిన ప్రణాళికను రూపొందించాడు. వాస్తు శాస్త్రం ప్రకారం కేవలం 15 అడుగుల వెడల్పు గోడలపై ఒకేసారి 8 గుర్రాలు నడిచేలా దీనిని నిర్మించారు. కోటలో నిర్మించిన ఒక్కో ద్వారానికి ఒక్కో పేరును పెట్టారు. శత్రువులు తేలికగా చొరబడకుండా కష్టతరమైన మెట్లను ఈ కోటలో నిర్మించారు. ఆరావళి పర్వతాల నుంచి శత్రువులు వస్తున్నప్పుడే వారిని చూసే వీలు కోటలోని వారికి ఉండేలా దీనిని నిర్మించారు. రెండు అంతస్తుల కోటలో ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది. రాత్రిపూట వెలుతురు కోసం 100, 50 కేజీల దూది పట్టే కాగడాలను వినియోగించేవారు. ఆ వెలుతురు దాదాపు కిలోమీటరు పైగా దూరం కనిపించేదట.

అనేక దండయాత్రలు

ఈ కోట నిర్మాణం అత్యంత అద్భుతంగా ఉండటంతో.. పలు రాజ్యాలు ఈ కోటపై దండెత్తడానికి సిద్ధంగా ఉండేవి. ఈ కోట కోసం రాజులు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ కోట ఏంటి?దానికి అంతటి గోడ ఏంటి? అని శత్రు రాజ్యాలు అయోమయం చెందేవి. ఆ కోటను దక్కించుకునేందుకు అక్బర్‌, మార్వార్‌ పాలకుడు రాజా ఉదయ్‌సింగ్‌, అమేర్‌ పాలకుడు రాజా మాన్‌ సింగ్‌, గుజరాత్‌ మీర్జాలు ఏకమయ్యారు. వారంతా కలిసి కోటకు వెళ్లే నీటిని విషపూరితం చేయడంతో విధిలేని పరిస్థితిలో మేవాడ్‌ రాజులు లొంగిపోయారు. అక్బర్‌ జనరల్‌ షాబాజ్‌ ఖాన్‌ 15వ శతాబ్దం చివరిలో కోటను స్వాధీనం చేసుకున్నాడు. 1818లో ఈ కోటను మరాఠా రాజులు ఆక్రమించారు.

Exit mobile version