Telangana Cabinet meeting at Secrateriat: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అయితే కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలపై అజెండా ఇప్పటికే సిద్ధమైనట్టు సమాచారం. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుందని తెలుస్తోంది. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు టాక్. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదల, కార్యాచరణ, బనకచర్ల, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నివేదికపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల డీఏ, సమస్యలపై కూడా మంత్రివర్గం మాట్లాడనున్నట్టు సమాచారం. విద్యాశాఖలో అడిషనల్ డైరెక్టర్ పోస్టు, ఇతర శాఖల్లో 16 అడిషనల్ పోస్టులు, ఫ్యాప్సికి పన్ను మినహాయింపు, హ్యామ్ రోడ్స్ వంటి అంశాలపై చర్చ జరగనుందట.
ఇంకా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ప్రకటన గురించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుందని టాక్. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, జీఎస్టీ, భూదాన్ భూముల దందా, గొర్రెల పంపిణీ స్కాం వంటి అంశాలను కూడా తేల్చాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వీటిపై ఎదైనా ప్రకటన వస్తుందేమోనని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పవర్ కమిషన్, కాళేశ్వరం రిపోర్ట్ ప్రభుత్వానికి చేరడం, మిగిలిన విచారణలు కూడా తుది దశకు చేరడంతో ఇవాళ జరగబోయే కేబినేట్ సమావేశంలో ఏం నిర్ణయం ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.