Prime9

Kaleshwaram Commission : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మరోసారి కేసీఆర్‌, హరీశ్‌రావు భేటీ

Former Minister Harish Rao meets KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మరోసారి సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఇద్దరూ మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై చర్చించారు. బుధవారం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు విచారణ అంశంపై సుదీర్ఘంగా చర్చినట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. హరీశ్‌రావును కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో నివేదిక కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. హరీశ్‌రావుతో పాటు ఫామ్‌హౌస్‌లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌‌రెడ్డి ఉన్నారు.

 

సోమవారం కమిషన్ విచారణకు హరీశ్‌‌రావు హాజరయ్యారు. విచారణ అనంతరం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ తీరుపై అధినేతకు వివరించారు. వీరి సమావేశం 5 గంటల పాటు సాగింది. మంగళవారం మరోసారి హరీశ్‌రావు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కమిషన్ విచారణకు బుధవారం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది. విచారణ సందర్భంగా కమిషన్‌కు అందించాల్సిన డాక్యుమెంట్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.

 

కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ వెళ్లే సమయంలో మద్దతుగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివస్తారని తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పియర్స్‌ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన నేపథ్యంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించింది.

Exit mobile version
Skip to toolbar