Twitter blue tick: ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విటర్ ను.. వ్యాపార దిగ్గజం, బిలియనీర్ ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత పలు సంచలన మార్పులకు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ట్విటర్ అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్ ’ లోనూ మార్పులు చేశారు. బ్లూ టిక్స్ కోసం చార్జీలను ప్రవేశపెట్టారు. ఆ చార్జీలు చెల్లించని వారికి వెరిఫికేషన్ మార్క్ ను తీసేస్తామని గతంలో వెల్లడించారు. తాజాగా ఎలాన్ మస్క్ అన్నంత పని చేశారు. బ్లూ ట్రిక్ ను వెరిఫికేషన్ ప్రక్రియను గురువారం నుంచి అమలులోకి తేవడంతో .. చార్జీలు చెల్లించని వారు బ్లూ టిక్ కోల్పోవాల్సి వచ్చింది. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినీ, క్రీడా, రాజకీయ రంగాలను చెందిన పలువురు ప్రముఖలు అకౌంట్స్ కు వెరిఫికేషన్ టిక్ తొలగించింది. ఇకపై నెలవారీ ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే ఈ బ్లూ టిక్ మార్కులను కొనసాగించనుంది. ట్విటర్ పర్సనల్ అకౌంట్స్ కు బ్లూ టిక్ పొందాలంటే 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
కాగా భారత్ నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు, పలు పార్టీల అధికారిక అకౌంట్స్ కు కూడా బ్లూ టిక్ ను తొలగించారు. ఏపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, యూపీ, పంజాబ్, ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, యోగి ఆదిత్యనాథ్, భగవంత్ మాన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు రాజకీయ వేత్తల ఖాతాలకు ఇప్పుడు వెరిఫైడ్ మార్క్ కన్పించట్లేదు. ఇక, భాజపా, కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీల అధికారిక అకౌంట్లకు కూడా బ్లూ టిక్‌ను తీసివేశారు.
అదే విధంగా సినీ సెలబ్రెటీలు మెగా స్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొణె, ఆలియాభట్.. క్రీడా రంగంలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సైనా నెహ్వాల్, సానియా మీర్జా, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా..మొదలైన ఖాతాలకూ వెరిఫికేషన్ బ్యాడ్జ్ తొలగించారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే పోప్ ఫ్రాన్సిస్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే తదితరులు కూడా బ్లూ టిక్ ను కోల్పోయిన వారిలో ఉన్నారు.
ట్విటర్ లో రెవెన్యూను పెంచుకునేందుకు బ్లూ టిక్‌కు సబ్‌స్క్రిప్షన్ తీసుకొచ్చారు ఎలాన్ మస్క్ . దీనిపై మొదట తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఫేక్ అకౌంట్స్ పెరగడంతో కొన్నాళ్లు ఈ సేవలను నిలిపివేశారు. ఆ తర్వాత మళ్లీ బ్లూ టిక్ ప్రీమియం సేవలను మొదలుపెట్టారు. ఈసేవలను పొందాలంటే.. వెబ్ యూజర్లు నెలకు 8 డాలర్లు, ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి తక్కువ ప్రకటనలు చూసే వెసులుబాటు, నిడివి ఎక్కువ ఉండే వీడియోలను పోస్ట్ చేసుకోవడం లాంటి ప్రయోజనాలను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే సెలబ్రెటీల పేరుతో విపరీతంగా నకలీ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. వీటిలో అధికారికి అకౌంట్ ను చూపించేందుకు బ్లూ ట్రిక్ ను ప్రామాణికంగా తీసుకుంటారు.