Bharath Jodo Yatra : రాహుల్ భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ ” రాజన్ “..!

  • Written By:
  • Updated On - December 14, 2022 / 06:37 PM IST

Bharath Jodo Yatra :  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులను ఉత్తేజం చేయడమే లక్ష్యంగా రాహుల్‌ గాంధీ చేస్తున్న ఈ యాత్రకు ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుండగా రోజుకు సగటున 25 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3,570 కిలోమీటర్లు పొడవునా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ప్రస్తుతం రాజస్థాన్ లో భారత్ జోడో యాత్ర నడుస్తుండగా ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి విశేష స్పందన వచ్చింది.

రాహుల్ గాంధీ యాత్రలో ఇప్పటికే ఉద్యమకారిణి మేధాపాట్కర్, నామ్ దేవ్ దాస్ త్యాగి, స్వర భాస్కర్, బాక్సర్ విజేందర్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పూనమ్ కౌర్ పాల్గొన్నారు. అయితే తాజాగా ఈ యాత్రలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈరోజు ఉదయం రాజస్థాన్‌ లోని సవాయ్ మాధోపూర్ నుంచి కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభమయ్యింది. ఈ సంధర్భంగా రాహుల్ గాంధీతో కలిసి రఘురామ్ రాజన్ కూడా నడిచారు. ఈ మేరకు రాహుల్ గాంధీతో రఘురామ్ రాజన్ పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలానే ట్విట్టర్‌ వేదికగా ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడానికి రాహుల్ గాంధీ చేపట్టిన ఈ భారత్ జోడో యాత్రకు మద్ధతు పెరుగుతోందని రాసుకొచ్చారు. అలానే రాహుల్ గాంధీతో కలిసి రఘురామ్ రాజన్ నడవడం పట్ల అందరూ పలు రకాల కామెంట్లు ఇస్తున్నారు.

అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ విమర్శిస్తూ ఒక పోస్ట్ చేసింది. రాజన్ తనను తాను తదుపరి మన్మోహన్ సింగ్‌గా అభివర్ణించుకుంటున్నారని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలను అవకాశవాద వ్యాఖ్యలుగా బీజేపీ విమర్శించింది.