Digital Payments: డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ అగ్రస్థానానికి ఎదిగింది. 2022 ఏడాదికి గాను మన దేశంలో 89.5 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ మైగవ్ ఇండియా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా రియల్ టైం పేమెంట్స్ లో భారత్ వాటా 46 శాతంగా ఉంది. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ తర్వాత బ్రెజిల్ రెండో ప్లేస్ లో ఉంది. గత ఏడాది ఆ దేశంలో 29.2 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. మూడో స్థానంలో చైనా( 17.6 బిలియన్లు), నాల్గో స్థానంలో థాయ్ లాండ్( 16.5 బిలియన్లు), దక్షిణ కొరియా 8 బిలియన్ల లావాదేవీలతో ఐదో స్థానంలో ఉంది.
అధికంగా యూపీఐ లావాదేవీల వాటా(Digital Payments)
భారత్ డిజిటల్ చెల్లింపుల్లో నెంబర్ 1 గా ఉందని.. మొబైల్ డేటా సేవలు అత్యంత చౌకగా లభిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. దీంతో దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటల్ గా మారుతోందని భారత ప్రధాని మోదీ ఈ ఏడాది ఆరంభంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
2013-14 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 127 కోట్ల డిజిటల్ చెల్లింపు లావాదేవీలు నమోదు అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం( 2022 ఏప్రిల్-23 మార్చి వరకు) లో 12,735 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో యూపీఐ లావాదేవీల వాటా అధికం.