Cognizant Layoffs: మరో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్.. తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లేఆఫ్స్ లిస్టింగ్ లో కాగ్నిజెంట్ కూడా వచ్చి చేరింది. సంస్థలోని 3500 మందిని ఉద్వాసన పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. ఖర్చుల నియంత్రణలో భాగంగా త్వరలోనే భారీ ఎత్తున్నఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇవ్వనున్నట్టు కాగ్నిజెంట్ సీఈఓ ఎస్ రవి కుమార్ తెలిపారు. అదే విధంగా 11 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను కూడా వదులుకోనున్నట్టు చెప్పారు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
మెజార్టీ ఉద్యోగులు భారత్ లోనే(Cognizant Layoffs)
కాగ్నిజెంట్ సంస్థ అమెరికాకు చెందినది. కానీ ఎక్కువగా ఇండియాలోనే ఆ సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ల నుంచి కాగ్నిజెంట్ గట్టి పోటీ ఎదుర్కోంటుంది. ఈ సంస్థలో ప్రస్తుతం 3,51,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో మెజార్టీ ఉద్యోగులు(2 లక్షల వరకు) భారత్ లోనే విధులు నిర్వస్తున్నారు. గతంలో సీఈఓ గా ఉన్న బ్రెయిన్ హంఫ్రీన్ ను అనూహ్యంగా విధుల నుంచి తప్పించారు. దీంతో ఈ ఏడాది జనవరి 12 న కాగ్నిజెంట్ సీఈఓ గా రవి కుమార్ బాధ్యతలు చేపట్టారు.
కార్యాలయాలు మూసివేత
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాగ్నిజెంట్ నికర లాభంలో 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 11.2 శాతం ఎక్కువ. అయితే అతి తక్కువగా 14.6 శాతం మార్జిన్లు మాత్రమే కంపెనీ నమోదు చేసినట్టు పేర్కొంది. పూర్తి ఏడాదికి ఆదాయం తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే పునరుద్ధరణ చర్యల్లో భాగంగా తీసివేతలకు సిద్దమైంది. అందులో భాగంగా మొత్తం 3500 మందిని తీసివేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే, ఇందులో భారత్ నుంచి ఎంతమంది ఉద్యోగులు ఉంటారనే అనే విషయం స్పష్టట లేదు. ఖర్చుల తక్కించుకోవడానికి కొన్ని కార్యాలయాలను కూడా కాగ్నిజెంట్ మూసివేస్తోంది.