Site icon Prime9

Lucknow Super Giants vs Delhi Capitals : ఢిల్లీపై సూపర్ విక్టరీ సాధించిన లక్నో.. చితక్కొట్టిన కైల్ మేయర్స్

Lucknow Super Giants vs Delhi Capitals match deatils

Lucknow Super Giants vs Delhi Capitals match deatils

Lucknow Super Giants vs Delhi Capitals : లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పాయి ఏక్నా స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మూడో మ్యాచ్‌లో లక్నో టీమ్ బోణీ కొట్టింది. 194 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమై 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.  భారీ టార్గెట్ ని ఛేజ్ చేసేందుకు బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు .. 4.2 ఓవర్ల దగ్గర మార్క్ వుడ్  షాక్ ఇచ్చాడు. 9 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన పృథ్వీ షాని క్లీన్ బౌల్డ్ చేసిన మార్క్ వుడ్, ఆ తర్వాతి బంతికే మిచెల్ మార్ష్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత వరుసగా అందరూ తక్కువ స్కోర్ లకే పెవిలియన్ బాట పట్టారు. వెంట వెంటనే వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్, మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.

ఈ క్రమంలోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. కానీ 48 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేసిన వార్నర్ అనుకోని రీతిలో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వార్నర్ అవుట్ అయ్యే సమయానికి ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 81 పరుగులు కావాలి.. అప్పటికే ఢిల్లీ ఓటమి దాదాపు ఖరారైపోయిందనే చెప్పాలి. ఇక 17వ ఓవర్‌లో 4 పరుగులే రాగా..  18వ ఓవర్‌లో 10.. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 55 పరుగులు కావాల్సి వచ్చాయి. ఇక చివర్లో బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో లక్నో విజయం లాంఛనం అయ్యింది. ఇక లక్నో బౌలర్స్ లో మార్క్ వుడ్ 5 వికెట్లు తీసి 2023 సీజన్‌లో ఈ ఫీట్ సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు. అలానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని కూడా పొందాడు.

అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. 12 బంతుల్లో 8 పరుగులు చేసిన రాహుల్, చేతన్ సకారియా బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సకారియా బౌలింగ్‌లో రాహుల్ అవుట్ కావడం ఇది మూడోసారి. 6 ఓవర్లు ముగిసే సరికి 30 పరుగులే చేసిన లక్నో.. ఆ తర్వాత కైల్ మేయర్స్ ఎంట్రీ నుంచే చితక్కొట్టుడుతో స్కోర్ వేగం పెంచాడు. తనదైన శైలి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి  38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73 పరుగులు చేసిన కైల్ మేయర్స్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ నికోలస్ పూరన్ (36: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), చివర్లో ఆయుష్ బదోని (18: 7 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) చెలరేగి ఆడారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

Exit mobile version
Skip to toolbar