BCCI held Rest IPL 2025 Matches in Bangalore, Chennai and Hyderabad: ఇండియా-పాకిస్థాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మిగిలిన 16 మ్యాచ్‌లను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే..
భారత ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే బీసీసీఐ ఉద్రిక్తంగా ఉన్న సరిహద్దులకు దూరంగా దక్షిణాదికి చెందిన మూడు నగరాల్లో మిగతా మ్యాచ్‌లు నిర్వహించాలనే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం.
మరింత కాలం వాయిదా..?
ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారంరోజుల పాటు వాయిదా వేసింది. వారం తర్వాత మ్యాచ్‌లను తిరిగి ప్రారంభించడంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యల గురించి బీసీసీఐ ఆయా ఫ్రాంఛైజీలకు అనధికారికంగా తెలియజేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ఈ ఏడాది చివరి వరకు మ్యాచ్‌లు వాయిదా పడే అవకాశమే ఎక్కువగా ఉందని క్రీడావర్గాలు భావిస్తున్నాయి.
విదేశీ ఆటగాళ్లు తిరిగి రావడం అనుమానమే..
విదేశీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఇప్పటికే వారి దేశాలకు పయనమయ్యారు. వీరిలో కొంతమంది త్వరలోనే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభమైనా వారు రావడం కష్టమే. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు జూన్ 11 నుంచి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనా ఆటగాళ్లు పాల్గొనడం సందేహమే.