Prime9

SRH Vs DC: కమ్మిన్స్ వీరవిహారం.. ఢిల్లీ స్కోర్ ఎంతంటే?

IPL2025: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు రెచ్చిపోయారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయకుండా అదుపు చేశారు. కెప్టెన్ కమిన్స్ కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ఢిల్లీని దెబ్బతీశాడు. దీంతో పవర్ ప్లే ముగిసే వరకు ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. తర్వాత కూడా కేఎల్ రాహుల్, విప్రాజ్ నిగమ్ కూడా వెనుదిరగడంతో ఢిల్లీ కనీసం 100 పరుగులైనా దాటగలదా అనే సందేహం కలిగింది. ఆ సమయంలో స్టబ్స్, అశుతోష్ శర్మ 68 పరుగుల కీలక భాగస్వామ్యం ఆడటంతో 20 ఓవర్లు ముగిసే వరకు 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగలిగింది. సన్ రైజర్స్ బౌలర్లలో కమ్మిన్స్ 3, ఉనద్కత్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ తలో వికెట్ తీసుకున్నారు.

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లను సన్ రైజర్స్ బౌలర్లు గట్టి దెబ్బ తీశారు. ఫస్ట్ ఓవర్ తొలిబంతికే కరుణ్ నాయర్ ను కమ్మిన్స్ డకౌట్ చేశాడు. రెండో ఓవర్లో డుప్లెసిస్ (3), మూడో ఓవర్ లో అభిషేక్ పోరెల్ (8) పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆరో ఓవర్ లో అక్షర్ పటేల్ ను హర్షల్ పటేల్ అవుట్ చేయడంతో ఢిల్లీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా 8 ఓవర్ లో కేఎల్ రాహుల్ (10) ను ఉనద్కత్ అవుట్ చేశాడు. ఆ తర్వాత స్టబ్స్, విప్రాజ్ నిగమ్ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు నిలవలేకపోయారు. 32 పరుగుల భాగస్వామ్యం తర్వాత విప్రాజ్ నిగమ్ (18) రనౌట్ గా వెనుదిరిగాడు. ఇక స్టబ్స్, ఆశుతోష్ శర్మ కీలక భాగస్వామ్యం ఆడి ఢిల్లీ జట్టు స్కోర్ బోర్డును 130 పరుగులు దాటించారు.

Exit mobile version
Skip to toolbar