Site icon Prime9

GT vs MI Qualifier 2 : శతక్కొట్టిన శుభ్‌మ‌న్ గిల్.. ముంబై ఇండియన్స్ పై గ్రాండ్ విక్టరీ కొట్టిన గుజరాత్ టైటాన్స్

GT vs MI Qualifier 2 match highlights in ipl 2023

GT vs MI Qualifier 2 match highlights in ipl 2023

GT vs MI Qualifier 2 : ఐపీఎల్ 2023 సీజన్‌లో ఫైనల్ కి ఒక్క అడుగు దూరంలో ఉన్న క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ బ్యాట్స్ మెన్ , ఓపెనర్ శుభమన్ గిల్ శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 233 పరుగుల భారీస్కోర్ ని నమోదు చేసింది. ఈ మేరకు టార్గెట్ ని ఛేదించే క్రమంలో ముంబై టీమ్ చేతులెత్తేయడంతో.. గుజరాత్ టైటాన్స్ టీమ్  62 ప‌రుగుల తేడాతో గ్రాండ్ గా విజ‌యం సాధించింది. దీంతో హార్దిక్ సేన వ‌రుస‌గా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైన‌ల్స్‌కు దూసుకువెళ్లింది. ఆదివారం (మే 28న) జరగనున్న మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో.. ఐపీఎల్ 2023 టైటిల్ కోసం పోరాడనుంది.

234 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై 18.2 ఓవ‌ర్ల‌లో 171 ప‌రుగుల‌కే ఆలౌలైంది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌ (61; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌ శ‌త‌కంతో అదరగొట్టగా.. మన తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌(43; 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ఉన్న కాసేపు మాత్రం మెరుపులు పెరిపించాడు. మిగిలిన వారిలో కామెరూన్ గ్రీన్ (30) ప‌ర్వాలేద‌నిపించ‌గా.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ (8), నెహ‌ల్ వ‌ధేరా(4), టిమ్ డేవిడ్‌(2), విష్ణు వినోద్‌(2) విఫ‌లం అయ్యారు. దాంతో ముంబైకి ఓటమి తప్పలేదు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మోహిత్ శ‌ర్మ ఐదు వికెట్లు తీయ‌గా ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ చెరో రెండు వికెట్లు, జాషువా లిటిల్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ అద్భుతమైన ప్రదర్శనతో అలరించింది. ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసిన సాహా (18:16 బంతుల్లో 3×4) తక్కువ స్కోరుకే ఔటైనా.. శుభ్‌మ‌న్ గిల్ మాత్రం ముంబై బౌలర్లను ఊరబాదుడు బాదాడు. మొత్తంగా 60 బంతులు ఆడిన గిల్ 7 ఫోర్లు, 10 సిక్స‌ర్ల‌తో 129 ప‌రుగులు చేశాడు. నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చిన సాయి సుదర్శన్ (43 రిటైర్డ్ హర్ట్: 31 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి దూకుడుగా ఆడిన శుభమన్ గిల్.. ముంబై ఇండియన్స్ బౌలర్లని ఉతికారేశాడు. క్రిస్ జోర్దాన్, పీయూస్ చావ్లా, ఆకాశ్ మాద్వాల్‌కి వరుస సిక్సర్లు బాదిన శుభమన్ గిల్.. కామెరూన్ గ్రీన్‌ని కూడా వదల్లేదు. తొలి 32 బంతుల్లో 50 పరుగులు చేసిన గిల్.. ఆ తర్వాత 17 బంతుల్లోనే 100 పరుగుల మార్క్‌ని అందుకోవడం విశేషం. గుజరాత్ టీమ్ స్కోరు 192 వద్ద శుభమన్ గిల్ ఔటైపోగా.. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్య (28 నాటౌట్: 13 బంతుల్లో 2×4, 2×6) వేగంగా ఆడాడు. దాంతో మొత్తానికి గుజరాత్ భారీ స్కోర్ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పీయూస్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్ చెరో వికెట్ పడగొట్టారు.

రికార్డులు తిరగరాసిన గిల్..

ఈ సీజ‌న్‌లో గిల్‌కు ఇది మూడో శ‌త‌కం కాగా.. చివరిగా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడో సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒక సీజ‌న్‌లో మూడు సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో గిల్ చోటు ద‌క్కించుకున్నాడు. ఈ ఘ‌న‌త సాధించిన రెండో భార‌త ఆట‌గాడు కాగా.. తొలి యంగెస్ట్ ప్లేయ‌ర్‌గా గిల్ రికార్డుల‌కు ఎక్కాడు. ఒక‌ సీజ‌న్‌లో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన ఆట‌గాళ్లుగా విరాట్ కోహ్లి(2016), జోస్ బ‌ట్ల‌ర్‌(2022) చెరో నాలుగు సెంచ‌రీలు చేసి సంయుక్తంగా మొద‌టి స్థానంలో ఉండ‌గా వీరి త‌రువాత గిల్ మూడు శ‌త‌కాల‌తో ఉన్నాడు. ఈ సెంచరీ ద్వారా  గిల్.. పలు రికార్డుల దుమ్ము దులపడంతో పాటు ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు.

 

Exit mobile version