Site icon Prime9

IPL New Rules: ఈసారి ఐపీఎల్ తీసుకొచ్చిన సరికొత్త రూల్స్ ఇవే..

IPL New Rules

IPL New Rules

IPL New Rules: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ఘనంగా ప్రారంభం అయింది. ప్రపంచంలోనే పెద్దదైన గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో కిక్కిరిసిన ఫ్యాన్స్ మధ్యలో ప్రారంభ వేడుకలు అంబరాన్ని అంటాయి. గత ఏడాది విజేత గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి పోరు అట్టహాసంగా జరిగింది. సీజన్ లో మొదటి మ్యాచ్‌ ఉత్కంఠగా జరగగా.. చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ జట్టు 5 వికెట్లతో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 178 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచింది.కాగా, ఐపీఎల్ లో ఈసారి మరికొన్ని సరికొత్త విధానాలతో వచ్చేసింది.

ఐపీఎల్ 16 లో కొన్ని కొత్త నిబంధనలు.. అవేంటంటే(IPL New Rules)

గత 15 సీజన్లలో ఇప్పటివరకు టాస్‌ వేయడానికి ముందే తుది జట్టును ప్రకటించాలి. రెండు జట్ల కెప్టెన్లు టాస్‌కి వచ్చినపుడు తమ తుది జట్టుకు సంబంధించిన షీట్లను మ్యాచ్ రిఫరీకి అందించేవాళ్లు. అయితే, తాజాగా సీజన్ 16 లో మాత్రం ఈ నిబంధనలో మార్పు చేశారు. కొత్త విధానం ప్రకారం టాస్ తర్వాత ఇరు జట్లు తుది జట్లను ప్రకటించే వీలుంది.

ఈ ఐపీఎల్‌ సీజన్ లో కొత్తగా తీసుకొచ్చిన ఇంకో నిబంధన ‘ఇంపాక్ట్ ప్లేయర్’. అంటే మ్యాచ్ లో పరిస్థితులను బట్టి 12వ ఆటగాడిని కూడా వినియోగించుకోవచ్చు. ఆ ఆటగాడిని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో దేనికైనా వాడుకోవచ్చు. అయితే, అతడు కెప్టెన్‌గా ఉండడానికి మాత్రం వీలు లేదు. అంతేకాకుండా టీమ్ లో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటే, 12వ ఆటగాడిగా మరో విదేశీ ప్లేయర్‌ ఉండకూడదు. 12 వ ఆటగాడు ఖచ్చితంగా ఇండియన్ ప్లేయర్ అయి ఉండాలి.

ఎక్కువగా వైడ్లు, నోబాల్స్ విషయంలో వివాదాలు తలెత్తుతుండడంతో వాటికి చెక్ పెట్టేందుకు కొత్త నిబంధన తీసుకొచ్చారు. వైడ్, నోబాల్స్ విషయంలో అనుమానం ఉంటే ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్స్ ను డీఆర్ఎస్ కోరుకోవచ్చు. ఈ నిబంధన కూడా స్వాగతించే పరిణామమని మాజీ ఆటగాళ్లు అంటున్నారు.

వికెట్ల వెనక కీపర్ కదలికలు సరిగా లేకుంటే ఫైన్ పడక తప్పదు. బ్యాటర్ బంతిని కొట్టకముందే వికెట్ కీపర్ కదిలితే దానిని అనుచిత కదలిక (Unfair Movements)గా పరిగణించి జరిమానా విధిస్తారు.

ఏదైనా జట్టు నిర్ణీత కోటాలో అంటే 90 నిమిషాల్లో 20 ఓవర్లు పూర్తి చేయకుంటే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలో కోటాను పూర్తిచేయకుంటే ఆ తర్వాత ప్రతి ఓవర్‌లో 30 యార్డ్ సర్కిల్ లోపల అదనపు ఆటగాడిని ఉంచాల్సి ఉంటుందనేది ఈ నిబంధన.

 

Exit mobile version