India beat England by 15 runs in Fourth T20 Match: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగానే పుణె వేదికగా కీలకమైన మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలో దిగిన టీమిండియాకు మ్యాచ్ ప్రారంభంలోనే షాక్ తగిలింది. టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైంది. ఓపెనర్ సంజు శాంసన్(1) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(0), సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్ మహ్మద్ వేసిన ఓవర్‌లో ముగ్గురిని ఔట్ చేయడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రింకు సింగ్(30) మెరుపులు మెరిపించాడు. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ(23) రషీద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన కాసేపటికే రింకు సింగ్(30) కార్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి రషీద్ చేతికి చిక్కాడు.
కష్టాల్లో ఉన్న భారత్‌ను హార్దిక్ పాండ్య, శివమ్ దూబె ఆదుకున్నారు. 10.4 ఓవర్లలో 70 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన జట్టను గట్టెక్కించారు. వీరిద్దరూ 6వ వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శివ్ దూబె(34 బంతుల్లో 53) పరుగులు, హార్దిక్ పాండ్య(30 బంతుల్లో 53) పరుగులు చేశారు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి భారత్ 181 పరుగులు చేసింది.
భారత్ విధించిన 182 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(23), డకెట్(39) పరుగులు చేశారు. డకెట్ ధాటికి భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారు. కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న వీరిద్దరి భాగస్వామ్యాన్ని రవి బిష్ణోయ్ విడదీశాడు. దీంతో 60 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. డకెట్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి సూర్యకుమార్ యాదవ్‌కు చిక్కాడు. ఆ తర్వాత అక్షర్ వేసిన బౌలింగ్‌లో సాల్ట్ కూడా ఔట్ అయ్యాడు. ఇక, ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో హ్యారీ బ్రూక్(51) తప్పా మిగతా వాళ్లు విఫలమయ్యారు. కెప్టెన్ బట్లర్ (2), లివింగ్ స్టోన్(9), బెథెల్(6), కార్స్(0), ఓవర్టిన్(19), ఆర్చర్(0), రషీద్(10) విఫలమయ్యారు.
ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా అదరగొట్టాడు. దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి హీరోగా అవతరించారు. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్తున్న సమయంలో 3 వికెట్లు తీశాడు. దీంతో ఓడిపోయే మ్యాచ్‌ను మలుపు తిప్పి ఒక్కసారిగా అందరి దృష్టి తనపై పడేలా చేశాడు. దూకుడుగా ఆడుతున్న బేథేల్, లివింగ్‌స్టోన్, ఓవర్టన్‌లను హర్షిత్ ఔట్ చేసి ఒక్కొక్కరిని పెవిలియన్ పంపించాడు. కాగా, హర్షిత్ రాణా.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఏడో ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బ్రయాన్, నీల్ రాక్, జోండో, పార్కిన్‌సన్, కమ్రాన్ గులాం, బహిర్షాలు డెబుట్ చేశారు.