FIFA World Cup: ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. బుధవారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆఫ్రికా దేశమైన మొరాకోపై ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. దీనితో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ రెండోసారి ఫైనల్ కు చేరింది. ఆదివారం జరిగే అమీతుమీ మ్యాచ్ లో అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడనుంది. మొదటి సెమీఫైనల్ మ్యాచులో క్రొయేషియాపై అర్జెంటీనా గెలిచి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
ముఖాముఖీ తలపడనున్న మెస్సీ- ఎంబపే
ఇకపోతే ప్రపంచకప్ సాధించిన తొలి ఆఫ్రికా దేశంగా నిలవాలనుకున్న మొరాకో ఆశలు అడియాశలయ్యాయి. ఫ్రాన్స్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మొరాకో జట్టు 0-2 గోల్స్ తేడాతో ఓటమిపాలయ్యింది. క్వార్టర్ ఫైనల్లో అద్భుతంగా రాణించి సెమీఫైనల్ కు చేరిన మొరాకో ఈ మ్యాచ్ లో మాత్రం అంతగా ప్రతిభ కనపరచలేకపోయింది. దీనితో పలువురు అభిమానులు అంచనా వేసినట్లుగానే ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబపే-అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీల మధ్య రసవత్తర పోరు జరుగనుంది.
మూడోస్థానానికై మొరాకో-క్రొయేషియా పోటీ
ఇక ఏ మాత్రం అంచనాలు లేకుండా ఫిఫా ప్రపంచకప్ 2022లో అడుగుపెట్టిన మొరాకో జట్టు ఆటతీరుతో పాటు, తమ ప్రవర్తనతోనూ ఫుట్‌బాల్ అభిమానుల మనస్సులు గెలుచుకుందనే చెప్పవచ్చు. నిజానికి చెప్పాలంటే మొరాకు సెమీఫైనల్ వరకూ రావడమే ఓ రికార్డ్ అని చెప్పాలి. కాగా, మొరాకోపై గెలిచి ఫైనల్ లోకి ప్రవేశించడంతో ఫ్రాన్స్ లో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదిలా ఉంటే ఫిఫా ప్రపంచ కప్-2022టోర్నీలో మూడో స్థానం కోసం శనివారం నాడు మొరాకో-క్రొయేషియా జట్లు తలపడనున్నాయి.
చెరో రెండు కప్ లు
ఇప్పటి వరకు మొత్తంగా ఫ్రాన్స్ రెండు సార్లు, అర్జెంటీనా రెండు సార్లు ప్రపంచ కప్ సాధించాయి. లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా బలమైన జట్టుగా ఉంది. ఫ్రాన్స్ ఈ ప్రపంచ కప్ లో మొదటి నుంచీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ఇక ముందుగా అందరూ ఊహించనట్లే అర్జెంటీనా-ఫ్రాన్స్ ఫైనల్ కు వెళ్లాయి.
గెలుపెవరిది..
ఇకపోతే గతంలో 2018 ప్రపంచ కప్ ను ఫ్రాన్స్ గెలుచుకుంది. ఆ సమయంలో క్రొయేషియా రన్నరప్ గా నిలిచింది. 1986 ప్రపంచ కప్ ఫైనల్లో అర్జెంటీనా విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మరోసారి ప్రపంచ కప్ గెలుచుకోలేదు. ఇక రేపు ఆదివారం నాడు ఏ జట్టు ఫిఫా కప్ ను సాధించనుందో అని యావత్ ఫుట్ బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ ప్రపంచ కప్ కూడా గెలిచి ప్రాన్స్ తన వరుసగా ఆధిపత్యాన్ని చూపనుందా.. లేదా ఇదే మెస్సీ ఆఖరి ప్రపంచ కప్ కాబట్టి మెస్సీసేన దూకుడు ప్రతిభ కనపరిచి ఘనంగా ప్రపంచకప్ తో ఆయనకు వీడ్కోలు పలకనుందా అనేది వేచిచూడాలి..
ఇదీ చదవండి: లియోనల్ మెస్సీ మ్యాజిక్.. అరుదైన రికార్డ్ సాధించిన “గోట్”.. ఫిఫా ప్రపంచకప్ దిశగా అర్జెంటీనా పయనం..!