Site icon Prime9

Fake IPL: గుజరాత్ లో ఫేక్ ఐపీఎల్.. బెట్టింగులు కాసి మోసపోయిన రష్యన్లు

Gujarat: గుజరాత్ లోని మోహ్సానా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు యూట్యూబ్ లో నకిలీ ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేశారు. స్థానికంగా ఓ చిన్నపాటి గ్రౌండ్ ఏర్పాటు చేసి, అక్కడి కూలీలు, యువకులకు రోజు కూలీ ఇచ్చి క్రికెట్ ఆడించారు. మ్యాచులను షూట్ చేయడానికి ఐదు హెచ్డీ కెమెరాలను కూడా ఉపయోగించారు. క్రికెట్ ఆడేవారికి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ధరించే జెర్సీలు వేశారు. ఇవన్నీ చేయడానికి వీరికి ప్రత్యేక శిక్షణతో పాటు అప్పటికప్పుడు ఆదేశాలు కూడా జారీ చేసేవారు.

నూతన టెక్నాలజీని ఉపయోగించి యూట్యూబ్ లైవ్ లో ప్రేక్షకులు అరిచినట్టు, ఫోర్, సిక్సర్ కొట్టినప్పుడు స్టేడియం అంతా హోరెత్తినట్టు ‘మాయ’ చేశారు. ఇక ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే లా మాట్లాడే ఓ మిమిక్రీ ఆర్టిస్టును పిలిపించి కామెంట్రీ ఇప్పించారు. అన్ని హంగులతో ఫేక్ ఐపీఎల్ నిర్వహించి, రష్యాలో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు మ్యాచులు చూసేందుకు లైవ్ లు ప్రసారం చేశారు. ఇదంతా చూసిన రష్యా బెట్టింగ్ వీరులు చెన్నై, ముంబై, గుజరాత్ ఫ్రాంచైజీల మీద బెట్టింగులు కాసి నిలువునా మోసపోయారు.

ఫేక్ ఐపీఎల్ తతంగం మొత్తాన్ని షోయభ్ దేవ్‌డా అనే వ్యక్తి నడిపించాడు. రష్యాలోని ఫేమస్ పబ్ లకు వెళ్తూ అక్కడ ఈ ఐపీఎల్ గురించి, బెట్టింగ్ గురించి వాళ్లను నమ్మించాడు. అయితే ఈ ఫేక్ ఐపీఎల్ సైబర్ క్రైం పోలీసులకు తెలవటంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఈ ఫేక్ ఐపీఎల్ తో పాటు నకిలీ ఛానెల్ ను నడిపిస్తున్న నలుగురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

పక్కా ప్లాన్ తో మూడు వారాలుగా గుజరాత్ లో జరుగుతున్న ఈ ఫేక్ ఐపీఎల్ టోర్నీలో ఇంకో విశేషం కూడా ఉంది. ప్రస్తుతం ఫేక్ ఐపీఎల్ గ్రూప్ స్టేజ్ దాటి క్వార్టర్స్ కు చేరుకుంది. ఇంతలోనే పోలీసుల కంటపడ్డారు. లేకపోతే ఫైనల్ మ్యాచ్ ను ఇటీవలే ముగిసిన రాజస్తాన్ రాయల్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కంటే ఘనంగా ప్లాన్ చేసేవాళ్లేమో అంటున్నారు ఈ విషయం తెలుసుకున్న వాళ్లు.

Exit mobile version