RCBw Vs DCw: మహిళల ఐపీఎల్ అరంగేట్రం సీజన్ లో మరో రికార్డు నమోదైంది. మెుదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సాధించగా.. ఆ రికార్డును దిల్లీ బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్ విధ్వంసానికి, పరుగుల ప్రవాహానికి వేదికగా నిలిచింది. షఫాలీ వర్మ పరుగుల వరద పారించింది. మెగ్ లాన్నింగ్ సైతం బౌలర్లకు చుక్కలు చూపించింది. దీంతో దిల్లీ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది.
దిల్లీ క్యాపిటల్స్ జట్టు పరుగల వరద పారించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అత్యధిక స్కోరు సాధించింది. ఈ మెుదటి మ్యాచ్ లో దిల్లీ బోణి కొట్టింది. ఈ మ్యాచ్‌లో 223 పరుగులు చేయడంతో గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నెలకొల్పిన 207 పరుగుల టీమ్ అత్యధిక స్కోర్ రికార్డు బద్దలైంది. ముంబై సాధించిన స్కోర్ కంటే డీసీ జట్టు 16 పరుగులు అధికంగా సాధించింది. డీసీ ఓపెనర్లు, ముఖ్యంగా షఫాలీ వర్మ వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలకు తరలించి, ఐపీఎల్‌కు డబ్ల్యూపీఎల్ ఏమాత్రం తీసిపోదని చెప్పకనే చెప్పింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దిల్లీ జట్టు.. 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ.. 223 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు 163/8కే పరిమితమైంది.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి షఫాలీ, మెగ్ లానింగ్ ధనాధన్ ఆటతీరుతో అలరించారు. పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. షఫాలీ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. లానింగ్ 30 బంతుల్లోనే ఈ మార్క్‌ను అందుకుంది. వరుస బౌండరీలతో విరుచుకుపడుతూ శతకాల దిశగా సాగుతున్న ఈ ఇద్దరూ బ్యాటర్లను హీథర్ ఒకే ఓవర్‌లో ఔట్ చేసి బెంగళూరుకు ఉపశమనం అందించింది. లానింగ్ క్లీన్‌బౌల్డ్ కాగా.. షఫాలీ.. వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ సైతం డీసీ తరహాలోనే రెచ్చిపోవడంతో మ్యాచ్‌లో విధ్వంసకర వాతావరణం కొనసాగింది. 4 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. వరుస వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన 35 పరుగులు చేసింది.