Site icon Prime9

Asia Cup 2022: స్టేడియంలో కొట్టుకున్న పాక్, ఆఫ్ఘన్ అభిమానులు

Pak-and-Afghan-fans-fight

Asia Cup 2022: బుధవారం అఫ్గాన్‌, పాక్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో చివరివరకూ సాగింది. మ్యాచ్‌ గెలవాలంటే ఆఖరి ఓవర్లో పాక్‌కు 11 పరుగులు కావాలి. ఫజల్ హక్‌ ఫారూఖీ వేసిన తొలి బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన నసీమ్‌ షా సిక్సర్‌గా మలిచాడు. అదే ఊపులో రెండో బంతినీ సిక్సర్‌ కొట్టి పాక్ ను గెలిపించాడు.

దీనితో పాక్‌ విజయం సాధించగానే అఫ్గాన్‌ అభిమానులు షార్జా స్టేడియంలోని కుర్చీలను విరగొట్టడం మొదలు పెట్టారు. కుర్చీలను పాక్‌ ఫ్యాన్స్‌ మీదకు విసిరారు. దాంతో రెండు జట్ల అభిమానులు పరస్పరం గొడవకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఫీల్డ్‌ బయట స్టాండ్స్‌లో మ్యాచ్‌ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌ అభిమానులు వీరంగం సృష్టించారు. అభిమానుల తీరుపై పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ స్పందించాడు. ‘ఇదీ అఫ్గాన్‌ అభిమానులు చేస్తున్న పని. కొన్నాళ్లుగా వారు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఇది ఆట. దీనిని క్రీడా స్ఫూర్తితో ఆడాలి. అలాగే ఓటములను భరించాలి. మీరు ఆటను అభివృద్ధి చేయాలంటే మీ ఆటగాళ్లు, ఫ్యాన్స్‌ కొన్ని విషయాలు నేర్చుకోవాలి’ అని అఫ్గాన్ క్రికెట్‌ బోర్డు సీఈవో షఫిక్‌ స్టానిక్‌జాయ్‌కు ట్యాగ్‌ చేశాడు. ఇందుకు అఫ్గాన్‌ ప్రతినిధి సైతం ఘాటుగానే బదులిచ్చాడు.

‘షోబయ్‌ ఓసారి ఈ ఫోటోలు, వీడియోలు జాగ్రత్తగా చూసి న్యాయం చెప్పండి. మీరు మా యావత్‌ జాతిని అవమానపరిచే మాటల కన్నా ముందు క్రికెట్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ రిఫరీని నిర్ణయించనివ్వండి. మీరిలా చేయడం ఇది రెండోసారి. నిజానికి మీరే మాకు క్షమాపణలు చెప్పాలి’ అని ట్వీట్‌ చేశాడు. మరోవైపు నేడు భారత్‌, అఫ్గానిస్థాన్ ఆఖరి సూపర్‌-4 మ్యాచులో తలపడుతున్నాయి.

Exit mobile version
Skip to toolbar